Jan 27,2023 23:24

కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న నాగేశ్వరరావు

4ఎపి పేపర్‌ మిల్లు కార్మికులకు సిఐటియు
సంపూర్ణ మద్దతు
4యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు
ఎవి.నాగేశ్వరరావు
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి
ఆంధ్ర పేపరు మిల్లు యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు హెచ్చరించారు. పేపరుమిల్లు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరాన్ని నాగేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాజమాన్యానికి బుద్ధి చెప్పేందుకు కార్మికులంతా ఐక్యంగా సిద్ధమవ్వాలన్నారు. పేపరు మిల్లు కార్మికులకు సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉందని, దాని స్ఫూర్తితో పోరాటాలను కొనసాగించాలన్నారు. గత ఒప్పందాలను యాజన్యం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. పేపరుమిల్లు యాజమాన్యం చట్టాలకు తూట్లు పొడిచి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారన్నారు. ఈ కార్మికులకు కేంద్ర కార్మిక సంఘాల మద్దతు కూడగట్టడంతో పాటు, రాష్ట్ర స్థాయిలో అధికారులను కలిసి సమస్యను విన్నవిస్తామని తెలిపారు. పేపరు మిల్లు కార్మికులకు అండగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపటతామని తెలిపారు. స్థానిక ఎంపీ భరత్‌ ఎవరిపక్షమో తేల్చుకోవాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడుతూ పేపరుమిల్లు నిరసన దీక్షలకు మద్దతుగా కార్మికులంతా పాల్గొనాలని సూచించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యం చట్టాలను గౌరవిస్తామంటూ చెప్పటం హాస్యస్పదమన్నారు. ఉన్నతాధికారులు పిలిచినప్పటికీ చర్చలకు వెనకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, అధ్యక్షులు ఎం.సుందరబాబు, అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి నాయకులు బి. పూర్ణిమరాజు, బి.పవన్‌, పోలిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.