Jul 01,2023 16:47

ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తే తగిన బుద్ధి చెబుతాం.
అంగన్‌వాడీల పోరు యాత్రలో యూనియన్‌
రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ.
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, ఉండ్రాజవరం
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.బేబిరాణి, సుబ్బరావమ్మ హెచ్చరించారు. అంగన్‌వాడీల పోరుయాత్ర ముగింపు సభ శుక్రవారం రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తే పాలకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే నూతనవిద్యా విధానం పేరుతో అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కి బడ్జెట్‌లో నిధులు కేటాయింపు తగ్గించి వర్కర్లకు, ఆయాలకు ఇవ్వాల్సినవి కూడా తగ్గిస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాణ్యత, పరిమాణం పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణాలో కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. చిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ వారి సమస్యలను మాత్రం పరిష్కరించట్లేదన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే నిర్భందాలకు గురిచేయడం సిగ్గుచేటని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వేతనాలు తక్కువైనా పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉందన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, వేతనంతో కూడిన మేటర్నరీ లీవ్‌లు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ నివ్వాలని, అధికారులు, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మాణిక్యాంబ, కె.బేబిరాణి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నపూర్ణ, బిఎం.మార్త, సుజాత, శారద, సునీత, రామలక్ష్మి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. తొలుత ఈ యాత్ర ఉండ్రాజవరంలో సాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబిరాణి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎ.అజయకుమారి, వై.సుజాత, డి.వెంకట లక్ష్మి, అన్నపూర్ణ, సిఐటియు ఉండ్రాజవరం మండలం కార్యదర్శి వెంకటేశ్వరరావు, నాయకులు తూరుగోపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.