Jul 12,2023 22:12

విద్యార్థులకు ఆహారం వడ్డిస్తున్న మిడ్డేమీల్స్‌ కార్మికులు

ప్రజాశక్తి - ఉండ్రాజవరం
సమస్యలతో మిడ్డే మీల్స్‌ కార్మికులు మగ్గిపోతున్నారు. వేతనాలు చాలక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రోజుకు సుమారు 4, 5 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నా నెలకు రూ.3వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారన్నారు. కూలీలకు సైతం రోజువారి వేతనం రూ.500 నుంచి రూ.800 ఉంటుందని, పాఠశాలల్లో శానిటేషన్‌ పనిచేస్తున్న వారికి కూడా రూ.6వేల వరకూ చెల్లిస్తున్నారని తెలిపారు. రూ.3వేలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ జీతాన్ని కూడా దఫదఫాలుగా ఇస్తున్నారని వాపోయారు.కూరగాయలు, నిత్యావసరాలు, వంట గ్యాస్‌ ధరల నేపథ్యంలో రూ.3వేలు ఏ మూలకూ రావట్లేదన్నారు. కొత్తగా రాగి జావను ప్రవేశపెట్టారన్నారు. వారానికి మూడుసార్లు కాయాల్సి రావడంతో గ్యాస్‌ బండ కూడా త్వరగా అయిపోతుందన్నారు. పొలం పనులకు వెళ్లలేక, ఇంటిలో ఖాళీగా ఉండలేక భర్తలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వంట పని చేస్తున్నామని, అదికూడా తమకు నష్టం కలిగిస్తే ఎలా అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వంట గ్యాస్‌ను ఉచితంగా అందించాలన్నారు. వేతనం విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా, పనిని బట్టి చెల్లించాలన్నారు. మండలంలో మొత్తం 74 మంది పనిచేస్తున్నామని తెలిపారు. తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వేడుకుంటున్నారు. దీనిపై ఎంఇఒ సిహెచ్‌.సక్సేనా మాట్లాడుతూ మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిని ఉన్నతాధికారులకు వివరించానని తెలిపారు.