Apr 18,2023 00:12

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పని చేస్తున్న ద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎపి స్టేట్‌ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి తోట వెంకట రామయ్య డిమాండ్‌ చేశారు. ఎపి అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వెంకట రామయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజు లోవ మాట్లాడారు. జిఒ 36 ప్రకారం జీతాలు చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల చట్టాన్ని సవరిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సహకార రంగ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు సివిల్‌ సప్లైస్‌ కమిషనరు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను కలిసి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని గతంలో కోరామని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వం స్పందించి సహకార రంగానికి న్యాయం చేయాలని కోరారు. పిఎసిఎస్‌లలో 50 శాతం వాటాలను ప్రైవేట్‌ వ్యక్తులకు, కంపెనీలకు ఇస్తూ రైతు భరోసా కేంద్రాలను పిఎసిఎస్‌లలో విలీనం చేస్తూ 1964 చట్టానికి చేసిన సవరణలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జిఒ 36 జిఒ 90 ప్రకారం వేతనాలను, ఇతర బెనిఫిట్స్‌ను వెంటనే అమలు చేయాలని, ఏప్రియల్‌ 1, 2019 నాటి వేతన సవరణ వెంటనే చేయాలని, ధాన్యం సేకరణలో ఇబ్బందులను తొలగించాలని, జిఒ 36లో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని, పిఎసిఎస్‌లకు ఇన్‌కం టాక్స్‌ పూర్తిగా మినహాయింపును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కెవివి.సత్యనారాయణ, కోశాధికారి జి.సుధాకర్‌ వర్మ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.వెంకటేశ్వరరావు, కెఎస్‌ఆర్‌ ప్రసాద్‌, బోర్లా రామచంద్రం పాల్గొన్నారు.