ప్రజాశక్తి-రాజమహేంద్రవరం కార్మికుల సమస్యలపై పోరాటమే బాలాజీదాస్‌కు ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. శనివారం బాలాజీదాస్ వర్థంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని శ్యామలా సెంటర్‌లో ఆయన విగ్రహానికి అరుణ్, పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వర రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ జిల్లాలో కార్మికవర్గాన్ని ఐక్యం చేసి, సంఘాలు పెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాలాజీదాస్ పోరాడారని అన్నారు. నాడు విద్యార్థి దశలోనే జాతీయొద్యమంలో పాల్గొన్నారని, జాతీయోద్యమ స్ఫూర్తితో కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడారన్నారు. రాజమహేంద్రవరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి ఎన్నో పోరాటాలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు సాధించారన్నారు. రాష్ట్ర స్థాయిలో కార్మిక నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. నేడు అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర పాలకులు కార్మికులు, ప్రజలపై తీవ్ర బారాలు మోపుతున్నారని, ప్రజల సంపదైన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. పాలకుల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే బాలాజీ దాస్‌కు నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు టిఎస్.ప్రకాష్, టి.సావిత్రి, రాజమండ్రి నగర కార్యదర్శి బి.పవన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా ఉపాధ్యక్షులు కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు, బిఎస్.ప్రకాష్, బి.సుధ పాల్గొన్నారు.










