Feb 27,2023 22:25

ప్రజాశక్తి - ధవళేశ్వరం ఆశాల సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద మండుటెండలో మహా ధర్నా చేపట్టారు. ఆశాలపై రాజకీయ నాయకులు, అధికారుల వేదింపులు అపాలని, ఆశాలకు పని బారాన్ని తగ్గించాలని, వేతన బకాయిలు ఇవ్వాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు బొమ్మూరులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాధవీలతకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. అంతకముందు ధర్నానుద్దేశించి సిటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నామణి, కె.పోశమ్మ, జిల్లా ట్రెజరర్‌ ఎం.వెంకటలక్ష్మి, నిడదవోలు పట్టణ గౌరవాధ్యక్షులు జె.రాంబాబు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు వేతనాలు ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయన్నారు. వేతనాలు తక్కువగా ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రాకపోయినా పట్టించుకోని అధికారపార్టీ నాయకులు వేతనాలు పెరిగాక ఉన్నవారిని ఎలాగైనా తొలగించి తమ అనుకునేవారికి పోస్టులు అమ్ముకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో కోవిడ్‌తో మరణించిన వారి స్థానంలో కారుణ్య నియామకాల ద్వారా చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబంలో వారికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశాలకు సంబంధం లేని వ్యాక్షిన్‌ క్యాన్లు తీసుకు రమ్మని చెప్పడం, యూనిఫామ్‌ తెమ్మనడం వంటి పనులు అధికారులు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అన్నారు. జిల్లాలో స్థానికంగా పిహెచ్‌సిల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని పరిష్కరానికి అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్ర రావు, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు బి.ధనలక్ష్మి, నాగమణి, లక్ష్మి, మేరీ, కె.వెంకటలక్ష్మి, హవేళ, సత్యవతి, లీల, కుమారి పాల్గొన్నారు.