104 ఉద్యోగుల సంఘం నాయకులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటానికి సిద్ధమవ్వాలని 104 ఉద్యోగులు సిద్ధమవ్వాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం 104 ఉద్యోగుల జిల్లా కమిటీ సమావేశం పేపర్ మిల్లు వద్ద గల బిటిఆర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు అలపాటి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బి.రాజులోవ, జిల్లా కార్యదర్శి మూల సింహాద్రినాయుడు మాట్లాడారు. 104 ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, వేతనాలు లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 104 ఉద్యోగులను ఆప్కాస్‌లో చేరుస్తామని జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జగన్ అధికారంలోకొచ్చిన నాలుగేళ్లు పూర్తవుతున్న నేటికీ ఆప్కాస్‌లో చేర్చలేదన్నారు. వెంటనే 104 ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, తదితర డిమాండ్లు పరిష్కారం కోసం ఈనెల 8 నుంచి 20 వరకు దశలవారీగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు జిల్లాలో మీ స్థాయిలో అధికారులకు ప్రజాప్రతి నిధులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెల కాంతారావు, జిల్లా కమిటీ సభ్యులు టివిఎస్.మల్లికార్జున్, రాంబాబు, కాంతా రావు, శివబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.










