Jun 27,2023 23:24

గోకవరంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి

ప్రజాశక్తి - గోకవరం, సీతానగరం, కొవ్వూరు
సమస్యలపై స్పందించకపోతే వైసిపి సర్కారుకు గుణపాఠం తప్పదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి హెచ్చరించారు. అంగన్‌వాడీల సమస్యలపై చేపట్టిన పోరుయాత్ర మంగళవారం సీతానగరం, గోకవరం, కొవ్వూరు మండలాల్లో సాగింది. గోకవరం దేవీచౌక్‌ వద్ద నిర్వహించిన సభలో బేబిరాణి మాట్లాడారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయాలని చూసే ఊరుకోబోమన్నారు. అంగన్‌వాడీలకు జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. చిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ వారి సమస్యలను మాత్రం పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. యాప్‌లు, ఇతర పనులతో అంగన్‌వాడీలపై పనిభారం పెరిగిపోయిందన్నారు. అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులను ఆపాలన్నారు. యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు అన్నపూర్ణ మాట్లాడుతూ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, వేతనంతో కూడిన మేటర్నరీ లీవ్‌ ఇవ్వాలన్నారు. ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మాణిక్యాంబ, కె.బేబిరాణి, నాయకులు బి.మార్త, ఎం.మార్త, ఎం.మాలతి, వివిడి.లక్ష్మి, కె.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీతానగరంలో మండలం చినకొండేపూడిలో జరిగిన అంగన్‌వాడీల పోరుబాట సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కొవ్వూరులో జరిగిన సభకు కొవ్వూరు ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సి.హెచ్‌.పుష్ప అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబిరాణి మాట్లాడారు. హెల్పర్లకు ప్రమోషన్‌లకు వయోపరిమితి 50 ఏళ్లు పెంచాలన్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జులై 10, 11 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద చేపట్టే నిరవధిక ధర్నాను జయప్రదం చేయాలన్నారు. హెచ్‌.అన్నపూర్ణ, బి.మధురవల్లి, డి.అమరావతి, కె.దుర్గామణి, సిహెచ్‌.భవాని తదితరులు పాల్గొన్నారు.