ప్రజాశక్తి - నిడదవోలు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్ సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. నిడదవోలు బాలుర జూనియర్ కళాశాల వద్ద ఈ యాత్రను ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకులు జువ్వల రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. తక్షణమే ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలన్నారు. నిలిపేసిన మిడ్డేమీల్స్‌ను పునరుద్దరించాలన్నారు. నిడదవోలులో మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, స్థానిక హై స్కూల్స్‌ను యాత్ర బృందం సందర్శించింది. స్థానికంగా జూనియర్ కాలేజీలో అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని తక్షణమే నాడు-నేడు నిధులు కేటాయించి ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి చేయాలని కోరారు. డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ డిగ్రీని రద్దు చేయాలన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక స్కూల్స్‌ని మూయించేయడం తగదన్నారు. ఎల్‌కెజి నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని సిఎం జగన్ చెబుతున్నారన్నారు. స్కూల్స్‌ని మూసేసి ఎలా విద్యను అందిస్తారని ప్రశ్నించారు. తరగతుల విలీనాన్ని నిలిపేయాలన్నారు. జిఒ 77ను రద్దుచేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ అందివ్వాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సన్న బియ్యంతో అందించి విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వై.భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ నిడదవోలు మండల నాయకులు నాని, కోవిద, రాజు, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి డివైఎఫ్‌ఐ నాయకులు ప్రసన్నకుమార్ మద్దతు తెలిపారు.










