ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రత్యేక హోదాపై ఆధార పడి ఉందని, ఆంధ్రరాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు యువత సమరశంఖం పూరించాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన సమర యాత్ర బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించింది. ఉదయం రాజమహేంద్ర వరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గాన కాకినాడ చేరుకున్నారు. ఇంద్రపాలెం నుంచి జెన్‌టియు వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జెఎన్‌టియు సెనెట్ హాల్లో సభ నిర్వహించారు. ఇంద్రపాలెం వద్ద యాత్రకు ఘన స్వాగతం లభించింది. పూలమాలలతో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక హోదా- ఆంధ్రులు హక్కు అనే నినాదాలు హోరెత్తాయి. తొలుత రాజమహేంద్ర వరంలో జరిగిన సభకు పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.సునీల్ అధ్యక్షత వహించారు. కాకినాడ జెఎన్‌టియులో నిర్వహించిన సభకు ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ నగర కార్యదర్శి ఎం.సూరిబాబు అధ్యక్షత వహించారు. ఈ బహిరంగ సభల్లో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. గడిచిన ఎనిమిదన్నరేళ్లలో విభజన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల పేరుతో మభ్య పెడుతూ కాలం వెల్లదీశారని విమర్శించారు. అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపి జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విభజన హామీలు సాధన కోసం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ మాట తప్పి మోదీకి భయపడుతు న్నాడని అన్నారు. హోదా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఢిల్లీ వెళ్లి ప్రకట నలు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు మాత్రమే ప్రత్యేక హోదా కోసం ప్రజలపక్షాన నిలబడి పోరాడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమా మహేశ్వరరావు, మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం యువజన విద్యార్థి సంఘాల చేస్తున్న సమరయాత్రకు పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణాలర్పిస్తే పరిశ్రమ ఏర్పాటు అయిందని తెలిపారు. అదే విశాఖ ఉక్కును మోడీ ప్రియ మిత్రుడు అదానీకి కట్టబెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగం లేకపోతే భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు ఉండవని అన్నారు. ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బిజెపి నేతలు వాఖ్యానించటం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర హక్కుల సాధనను విస్మరించి కాలక్షేపం చేస్తున్నాయన్నారు. అవకాశవాద రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తొలుత ఎఫ్‌ఎస్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు పావని మాట్లా డారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.అరణ్, కాకినాడ జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్తిరాజు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబిరాణి, సిపిఎం నగర కార్యదర్శి బి. పవన్, సిపిఐ నగర కార్యదర్శి కొండల రావు, కోనసీమ జిల్లా కార్యదర్శి సత్తిబాబు, పిడిఎస్‌యు నగర కార్యదర్శి ధర్మేష్, నగర నాయకులు దినేష్, శివ, మురళి డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాము, ఎఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి.భూషణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, ఎవైఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర, ఆప్ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ అత్తిలి రాజు పాల్గొన్నారు.










