Jul 17,2023 23:38

సమిష్టి కృషితో డ్రగ్స్‌ వాడకం నిర్మూలన

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన 3వ జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. డ్రగ్స్‌ దుర్వినియోగదారుల సంఖ్యను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా డ్రక్స్‌ సరఫరాకు చెందిన వివరాలు రాబట్ట గలుగుతామని అన్నారు. డ్రగ్‌ డిటెక్షన్‌ సెంటర్‌, అడిషనల్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ , ఇతర శాఖలు సమర్తవంతంగా పని చేస్తే తప్పకుండా సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. రానున్న రెండు నెలల్లో స్కూల్స్‌, కాలేజీలు, యూనివర్సిటీ, వసతి గృహాల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు విస్తత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేసేందుకు ఎస్‌ఇబి, ఫారెస్ట్‌, పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఇబి అధికారి పి.సోమ శేఖర్‌, జిల్లా ఫారెస్ట్‌ అధికారి బి.నాగరాజు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.రాంబాబు, ఆర్‌డిఒ ఎ.చైత్రవర్షిణి, డిపిఆర్‌ఒ ఎంఎల్‌ ఆచార్యులు, డిఇఒ ఎస్‌.అబ్రహాం, ఆర్‌టిసి డిఎం ఎస్‌కె.షబ్నం, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు పాల్గొన్నారు.