Apr 02,2023 22:44

సత్యనారాయణ మృతదేహానికి నివాళులర్పిస్తున్న అరుణ్‌, రాజా తదితరులు

సత్యనారాయణ ఆత్మహత్యతో కలకలం
అక్రమాలపై ఉదాసీనంగా ఆంధ్ర పేపర్‌మిల్లు యాజమాన్యం
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ఆంధ్రపేపరు మిల్లులో అక్రమాల 'పరంపర' కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురై కార్మికులు సమిధలవుతున్నారు. కార్మిక సంఘం నాయకుని ముసుగులో ఓ వ్యక్తి యాజమాన్య ప్రతినిధితో కుమ్మక్కై 'పరంపర-2' స్కీం పేరుతో అక్రమాలకు తెర లేపారని కార్మిక సంఘాలు చెబుతున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో మిల్లులోని 8 కార్మికసంఘాలు ఏకతాటిపైకి వచ్చి జనవరి 10 నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టాయి. ఇందులో భాగంగా పేపరు మిల్లు గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. పరంపర-2 ఆర్థిక లావాదేవీలు యూనియన్‌ నాయకుని ముసుగులో ఉన్న ఒక వ్యక్తి ద్వారానే సాగినట్లు తెలుస్తోంది. అయితే పరంపర స్కామ్‌ ఆ నోట..ఈ నోట బయటకు పొక్కడంతో ఉద్యోగాల అమ్మకాల వ్యవహారం నిలిచిపోయింది. అప్పటికే నగదు చెల్లించిన వారు ఆర్థికంగా నష్టపోయారు. ఈ అక్రమ దందాపై బహిరంగంగా ఫిర్యాదు చేయలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా సంగీత సత్యనారాయణ ఆత్మహత్యతో అక్రమాల పరంపర మరో సారి చర్చనీయంశమైంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, పేపరు మిల్లు యాజమాన్యం స్పందించి బాధితులకు అండగా నిలిచి అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.
2017 ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన పేపర్‌ మిల్‌ కార్మిక సంఘం ప్రతినిధి ఒకరు, మిల్లు యాజమాన్య ప్రతినిధి కలిసి అక్రమాలకు తెరలేపారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 2019లో అప్పటి గుర్తింపు సంఘంతో జరిగిన 12(3) ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికులను 54 మందిని సీనియారిటీ ఆధారంగా ఇన్‌ ప్లాంట్‌ ట్రైనీలుగా తీసుకోవడానికి, అదే విధంగా 55 మందిని బదిలీలుగా తీసుకోవడానికి, కోర్‌ విభాగాల్లో 55 ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయడానికి ఒప్పందం జరిగింది. గత గుర్తింపు సంఘం కాలపరిమితి 2019లో ముగిసింది. దీంతో కార్మిక శాఖ 2020 జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియ ప్రారంభించింది. ఓటర్ల జాబితా కూడా ఇచ్చింది. ఈ లోగా కోవిడ్‌ వ్యాప్తిని సాకుగా చూపి గత గుర్తింపు సంఘం ప్రతినిధి ఎన్నికలు జరగకుండా హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కార్మిక శాఖను, యాజమాన్యాన్ని కౌంటర్‌ దాఖలు చేయమని కోరింది. కానీ ఎక్కడ ఎన్నికల ప్రక్రియ నిలుపుదలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ కోర్ట్‌ అనే సాకు చూపి మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించడంలేదు. ఈ కాలంలో పరంపర పథకాన్ని తీసుకొచ్చారు. ఏడాది, రెండేళ్లు సర్వీసు ఉన్న పర్మినెంట్‌ కార్మికులను దాదాపు 60 మందిని రాజీనామా చేయాలని, అలా చేస్తే వారి కుమారుడు లేదా అల్లుడికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ పథకం ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు విన్పించాయి. పరంపర-2లో కార్మికుల పిల్లలు అనే విధానం కూడా పక్కకి పోయి బాహాటంగా ఉద్యోగాలు అమ్మకం పెట్టేశారు. ఒకొక్క పోస్టు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉద్యోగులు రాజీనామా చేస్తే తాము వదులుకున్న సర్వీస్‌ కాలానికి యాజమాన్యం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. దాదాపు 150 పోస్టులు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉదాసీనంగా యాజమాన్యం
పరంపర-2 స్కీం పేరుతో అక్రమాలు జరిగాయని కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి పరిశ్రమలో ఎన్నికలు జరుగుతాయి. గుర్తింపు సంఘం యాజమాన్యంతో వేతన ఒప్పందం పైన, ఇతర సమస్యల చర్చలు జరుపుతుంది. వేతన ఒప్పందం ప్రతి మూడున్నరేళ్లకు ఒకసారి జరుగుతుంది. మూడేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో పర్మినెంట్‌ కార్మికుల నూతన వేతన ఒప్పందం కూడా పెండింగ్‌లోనే ఉండిపోయింది. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌తో పూర్తయ్యింది. దాదాపు 32 నెలలు గడిచిపోయినా కొత్త వేతన ఒప్పందం నేటికీ లేదు. దీంతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.11వేల చొప్పున 700 మందికి నెలకు రూ.77 లక్షలు, 32 నెలల్లో రూ.24.64 కోట్లు నష్టపోయారు. అధికార యంత్రాంగం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.