ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
పాఠశాలు పున్ణప్రారంభం నాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. స్థానిక ఎస్‌కెవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి సంబందించి విద్యాకానుక కిట్ల స్టోరేజ్ పాయింట్‌ను విద్యాశాఖ అధికారులతో కలసి కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరానికి 1,21,735 మంది విద్యార్థులకు జెవికె కిట్లను పంపిణీ చేస్తామన్నారు. జిల్లాకు సంబంధించి 1.24 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 70,654 పుస్తకాలు వచ్చాయన్నారు. ఆయా స్టోరేజ్ పాయింట్స్‌కు చేరుకున్న మెటీరియల్‌లో ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి విద్యా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టోరేజ్ పాయింట్స్ వద్ద స్టాక్ బుక్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతీ విద్యార్థికి సరిపడే సైజు షూలు సిద్ధం చేసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెదలు దరిచేరకుండా చెదల మందు చల్లించాలన్నారు. వర్షాల నేపథ్యంలో కిటికీలు, గోడలకు అనుకుని స్టాక్స్ లేకుండా గది మధ్యలో సర్దించాలన్నారు. విద్యా కానుక కిట్లను ప్రణాళికాబద్దంగా పంపిణీ చేసే బాధ్యత ఆయా మండల విద్యా అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిఇఒ ఎస్.అబ్రహాం మాట్లాడుతూ 59,371 మంది బాలురు, 62,364 మంది బాలికలకు జెవికె కిట్లను పంచాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి 16,112 జెవికె కిట్ల కోసం ఇండెంట్ పెట్టామన్నారు. బూట్లు, సాక్స్, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో కూడిన కిట్స్ వచ్చాయని కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ ఉప విద్యా అధికారి బి.దిలీప్‌కుమార్, సమగ్ర శిక్షా సిఎంఒ శ్రీనివాస్, ఎస్‌కెవిటి హెచ్‌ఎం ఎంవిఎం.సుబ్రహ్మణ్యం, సిఆర్‌పిలు, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.










