May 22,2023 23:16

పెరవలి మండలం పక్కిలంకలో ఉపాధి పనులు చేస్తున్నకూలీలు

సకాలంలో అందని కూలి
మూడు లేక నాలుగు వారాలకు ఒక సారి చెల్లింపు
కుటుంబ పోషణకు తప్పని ఇబ్బందులు
నిబంధనల ప్రకారం చెల్లింపుల్లో జాప్యం
అప్పులపాలవుతున్న ఉపాధి కూలీలు
ప్రజాశక్తి రాజమహేంద్రవరం ప్రతినిధి
ఉపాధి కూలీలు ఆకలికేకలు పెడుతున్నారు. చేసిన పనికి సకాలంలో కూలి అందక ఇబ్బందులు పడు తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం అప్పులపాలవుతున్నారు. పని చేసిన మూడు, నాలుగు వారాలకు కూడా కూలి చెల్లించకపోవడమే ఈ దుస్థితికి కారణం.
ప్రతి ఏటా వేసవిలో ఉపాధి పనులను నిర్వహిస్తుంటారు. రోజువారీ వేలాది మంది కూలీలు పనులకు హాజరవుతుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారం లేదా సాంకేతిక సమస్యలు, ఇతరాత్ర కారణాలేమైనా ఉన్నా 15 రోజుల్లోగా చేసిన పనికి వేతనాలు చెల్లించాలి. కాని ఈ నిబంధనకు కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిస్తోంది. దీంతో ఉపాధి కార్మికులు పూట గడవక అప్పులు చేసి బతుకీడ్చుతున్నామని చెబుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి సైతం జీతాల చెల్లింపు లక్ష్యాలను విధించటంతో అవస్థలు పడుతున్నారు. మరో వైపు కార్మికులకు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడుతున్నారు.
జిల్లాలో ముమ్మరంగా ఉపాధి పనులు
జిల్లాలో 2022-23కి గానూ 58 లక్షల పనిదినాలు కల్పన ద్వారా సుమారు రూ.217 కోట్ల మేర వేతనాలు కూలీలకు అందజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకూ 10.05లక్షల పనిదినాలు కల్పించారు. వాటిలో గరిష్ఠంగా రాజానగరం నియోజక వర్గం 2.11 లక్షల పనిదినాలు నమోదు కాగా, గోపాలపురం నియోజకవర్గంలో 1.76 లక్షల పనిదినాలు పూర్తయి రెండో స్థానంలో ఉంది. నిడదవోలు నియోజక వర్గం కేవలం 2.27 లక్షల పనిదినాలు నమోదై జిల్లాలోనే చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ ఈ పనులకు గానూ కూలీలకు రూ.20 కోట్లు వేతనాల రూపంలో చెల్లించారు. మరో రూ.15 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌కు వెచ్చించారు. కరోనా సమయంలో ఇతర పనులకు ఆటంకం కలిగినా ఉపాధి పనులు కొనసాగడంతో వ్యవసాయ కూలీలు కొంత ఊరట చెందారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించిన ఉపాధి పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి పలు విమర్శలకు దారి తీస్తోంది.
రెండు లేక మూడు నెలలకోసారి
సాధారణంగా పనులు చేసిన కూలీలకు వారం వారం మస్తర్ల ప్రకారం వేతనాలు వ్యక్తుల వారీగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అలా చేసిన వారంలోపే వారి అకౌంట్లలో నేరుగా వేతన మొత్తాలు జమ అవుతాయి. బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకొచ్చినప్పటి నుంచి రెండు లేక మూడు నెలలకోసారి జమ చేయడం పరిపాటిగా వస్తోంది. గతంలో కూలి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు వెంటనే జరిగేది. మెటీరియల్‌ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే ఆలస్యమవుతుండేవి. కానీ ఇప్పుడు సాధారణ పనులకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోవడంతో కూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కూలీల్లో అత్యధిక మందికి కూలిపైనే ఆధారపడుతున్నారు. దానితోనే కుటుంబాన్ని పోషిస్తుంటారు..ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉపాధి పనులకు వెళ్తుండటంతో బకాయిలు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు, మరికొన్ని ప్రాంతాల్లో ఏడెనిమిది వారాల కూలి డబ్బుల బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయో అర్థంకాక ఎదురుచూస్తున్నారు.
అప్పు కూడా పుట్టడం లేదు
కిరాణాషాపుల్లో అప్పులు చేసి సరుకులు కొనుగోలు చేసిన వారికి వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరిగింది. కొత్తగా అప్పు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. దీంతో బయట అప్పులు చేయాల్సి వస్తుంది. గత మూడు వారాలుగా వేతనాలు రాలేదు. మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను అడుగుతుంటే త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. అధికారులు సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
- సిహెచ్‌.నాగరాజు, పక్కిలంక, తాళ్లపూడి మండలం
మార్చి నెలాఖరు వరకూ చెల్లించాం..
మార్చి నెలాఖరు వరకూ ఇటీవలే బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఉపాధి పనులకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ కూలీల నగదు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. ఈ ఏడాది కూడా సుమారు 60 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాము. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించాము.
- రామ్‌ గోపాల్‌, డ్వామా పీడీ, తూర్పుగోదావరి జిల్లా