ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, ధవళేశ్వరం
సిపిఎస్ రద్దయ్యే వరకూ పోరాటం అపేది లేదని యుటిఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ధవళేశ్వరంలోని కలెక్టరేట్ వద్ద అక్రమ నిర్బంధాలు, అరెస్టులను నిరసిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యుటిఎఫ్ చేపట్టిన సంకల్ప దీక్ష కార్యక్రమానికి ప్రభుత్వం పలు విధాలుగా అడ్డంకులు సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే కార్యకర్తలను, సంఘ నాయకులను నిర్బంధించి అప్రజాస్వామి కంగా వ్యవహరించిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్భందించారన్నారు. న్యాయమైన హక్కుల కోసం అడిగితే ప్రభుత్వం ఇలా నియంతృత్వంగా వ్యవహరించడం సరికాదన్నారు. వీటిని నిరసిస్తూ పడిఎఫ్ ఎంఎల్‌సిలు చేపట్టిన దీక్షలకు కూడా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ అధికారంలోకొచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని మాత్రమే తాము అడుగుతున్నా మన్నారు. గొంతెమ్మ కోరికలు కోరడంలేదన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపాధ్యాయుల ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భరోసా ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ విషయంలో కనీసం మ్యాచింగ్ కూడా వేయకుండా పది నెలలు గడిపిందన్నారు. ప్రభుత్వం న్యాయమైన ఆలోచన చేయాలని చేయాలని ఆయన కోరారు. ఎల్‌ఐసి సంఘ నాయకులు సతీష్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు వేలకోట్లు రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రతి విషయంలో అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. కనీసం ఒక శాతం కూడా లేని పెన్షన్లకు బడ్జెట్లో అధిక భాగం కేటాయిస్తున్నామని చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. సిఐటియు ఉపాధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందేనన్నార. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సేవలను వినియోగించుకుని వృద్ధాప్యంలో వారిని గాలికి వదిలేయాలని భావించడం సరికాదన్నారు. ఈ వైఖరిని విడనాడకపోతే ప్రజాస్వామ్యతంగా పోరాటం చేసి సాధించుకుంటామని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధనలో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు శంకరుడు, సహాధ్యక్షురాలు ఎం.విజయగౌరి, కన్వీనర్ రమేష్ బాబు, కార్యదర్శులు జిడివి.సత్య నారాయణ, ఎన్.రవి బాబు, రాంబాబు, మహా లక్ష్మి, ఎం.శ్రీనివాస్, ప్రకాష్‌రావు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు పవన్, ఎల్‌ఐసి సంఘ నాయకులు గుబ్బల రాంబాబు, కెవిపిఎస్ నాయకులు జె.రాంబాబు మద్దతు తెలిపారు.










