May 13,2023 23:27

ప్రజాశక్తి-గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు శనివారం గోపాలపురం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కొంతసేపు వైద్యులతో అక్కడ ఉండే సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఎ విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందన్నారు. ప్రస్తుతానికి డిప్యూటేషన్‌పై డాక్టర్లను రప్పిస్తామన్నారు. జనరేటర్‌కు సుమారు రూ.3,50,000 ఖర్చు అవుతుందని, ఎవరైనా దాతల చేత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎక్సరే మిషన్‌ త్వరలో ఏర్పాటు చేస్తామని, మార్చురీ రూము మంజూరయ్యిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోపాలపురం సిహెచ్‌సిలో అందుబాటులో ఉండడంతో క్షతగాత్రులను ఇక్కడికి తరలిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైద్య, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని త్వరలో ఆసుపత్రికి కావలసిన వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.