Jun 01,2023 00:10

ప్రజాశక్తి-గోపాలపురం గంగోలులో నిర్మిస్తున్న కెమికల్‌, బల్క్‌ పరిశ్రమల వల్ల గాలిలో నీటిలో వ్యర్థాలు ప్రవేశించి అనారోగ్య సమస్యలతో వ్యాధుల బారిన పడతారని ఎట్టి పరిస్థితుల్లో సిఎస్‌డి పరిశ్రమను అడ్డుకుంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. బుధవారం సిపిఐ నాయకత్వంలో సగ్గొండ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గోపవరం దళిత ఓడలోని కమ్యూనిటీ హాల్‌ గ్రౌండ్‌లో జరిగిన పోరాట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఊరికి పరిశ్రమకు సుమారు 700 మీటర్ల పరిధిలో ఉందని దీనిని బట్టి పరిశ్రమ వల్ల ప్రజలకు వచ్చే అంటువ్యాధులు చర్మవ్యాధులు క్యాన్సర్‌ సైతం వచ్చే ముప్పు ఉందన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బల్క పరిశ్రమలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అలాంటిది ఊరు మధ్యలో బల్క పరిశ్రమ నిర్మించడం దారుణం అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. పరిశ్రమలు స్థాపనకు సిపిఐ పార్టీ వ్యతిరేకం కాదని, పరిశ్రమల ద్వారానే ఉద్యోగుల కల్పన జరుగుతుందని ఈ విషయం యాజమాన్యం గుర్తించి జనావాసాలకు సుదూర ప్రాంతంలో నెలకొల్పడం సమంజసమన్నారు. గ్రామానికి అత్యంత సమీపంలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కారణంగా ఈ నెల 5న జరిగే గ్రామసభలో ప్రజలందరూ పాల్గొని ఈ పరిశ్రమ వద్దంటూతీర్మానం చేస్తామన్నారు. ఇక్కడ నిర్మించే పరిశ్రమల గూర్చి ఆలోచన వెనక్కు తీసుకునే వరకు సిపిఐ దశలవారీ పోరాటం చేస్తుందని ఇందులో భాగంగా నిరాహార దీక్ష మానవహారం హైవే నిర్బంధం వంటి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు వి.కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్‌, రవీంద్ర, పోలపల్లి ఏసు, ముప్పిడి రాజేష్‌, చాపల యేసు, సొంగ కిషోర్‌, పోలపల్లి చినబాబు, గడ్డం ఆనంద్‌, భూషణం, కడిమి బాలకృష్ణ, ఈర్లగడ్డ హనుమంతు పాల్గొన్నారు.