ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించినట్టు హోమ్ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్న ఘనత మన జగనన్నకే చెల్లిందని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు చేసిన ఆయా పేద కుటుంబాలకు చేదోడుగా నిలిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కొవ్వూరు పట్టణానికి చెందిన మట్టే సీతారామాంజనేయులుకు సర్జరీ నిమిత్తం రూ.మూడు లక్షలు, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి గ్రామానికి చెందిన నామన శివసాయి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.రెండు లక్షల చెక్కు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










