ప్రజాశకి - నిడదవోలు
నిడదవోలు పట్టణంలో ఈ నెల 22న జరిగే సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంఎల్‌సి, సిఎం కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పురపాలక సంస్థ కార్యాలయ సమావేశమందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లుపై ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్, జెసి తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్, సహాయ కలెక్టర్, ఎంఎల్‌ఎలు జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకట్రావులతో కలిసి వారు సమీక్షించారు. కాపునేస్తం రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఏడు సార్లు జిల్లాలో సిఎం పర్యటించారని, సమన్వయంతో వీటన్నింటినీ విజయవంతం చేశామన్నారు. ప్రస్తుత పర్యటనకు సంబందించి వివిధ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కేటాయించిన విధులను బాధ్యతా యుతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగేందుకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రోడ్ షోలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్షం కురిసే అవకాశం ఉన్న దష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్లు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికీ తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. సమయం తక్కువుగా ఉన్నందున అధికారులు వారికి కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అధికారులకు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు సంబందించి గత అనుభవం ఉందని ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక మేరకు విజయవంతం చేయాలన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత హాజరవుతారని అందుకు తగిన జాగ్రత్తలు అవసరం అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘూరాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లాలో అధికారులకు అనుభవం ఉందని ఆ దిశలో అధికారులకు కేటాయించిన విధులను చేపట్టి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి బందోబస్తు, బారికేడింగ్, రూట్ ఆపరేషన్, వాహనాల పార్కింగ్, సభా వేదిక వద్ద భద్రత వంటి ఏర్పాట్లను వివరించారు. జెసి ఎన్.తేజ్ భరత్ మొబలైజేషన్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్ షోపై సమీక్ష నిర్వహించారు. గ్యాలరీ ఇన్‌ఛార్జిగా సహాయ కలెక్టర్ సి.యస్వంత్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. తొలుత నిడదవోలు చేరుకున్న కలెక్టర్ హెలిపాడ్, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఒలు ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌విఎస్‌ఎస్.సుబ్బలక్ష్మి, సిపిఒ ఎ.ముఖలింగం, వివిధ శాఖల ఎస్‌ఇలు ఎబివి.ప్రసాద్, ఎస్‌బివి.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










