మంత్రులు వేణుగోపాలకృష్ణ, వనిత
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఈ నెల 14న సిఎం కొవ్వూరులో పర్యటించనున్నారు. ఈ ప్రాంతాలను మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, సిఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎస్‌పి సుధీర్‌కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదివరం పరిశీలించారు. హెలీప్యాడ్, సభావేదిక స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. కొవ్వూరులోని గోష్పాదాల రేవు ప్రాంతం, సత్యవతి నగర్, బుద్దుడు జంక్షన్, యువరాజ్ హోటల్ సెంటర్ ప్రదేశాలను పరిశీలించామన్నారు. సిఎం కార్యక్రమానికి అనువుగా ఉన్న హెలీప్యాడ్ స్థలాన్ని బుద్దుడు జంక్షన్ వద్ద, సభావేదికను సత్యవతి నగర్‌లోని హోం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో సిఎం పర్యటన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏప్రిల్ 14న 'వాలంటీర్ వందనం' కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వాలంటరీల్కఉ సేవా పురస్కారాలను సిఎం అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో విధులు నిర్వహించాలన్నారు. సిఎం కార్యక్రమాల సలహాదారు, ఎంఎల్‌సి తలశిల రఘురాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్థేశం చేశామన్నారు. అనంతరం కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. సచివాలయ సిబ్బందికి అవార్డులు, నగరు పురస్కారాలు అందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి జిల్లా వేదిక కానుందన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన వేడుకలకు సమయం తక్కువుగా ఉన్నందున అధికారులు వారికి కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 512 సచివాలయాల నుంచి సుమారు 18 వేల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ వేడుకలకు రానున్నారన్నారు. సభా వేధిక వద్ద 24 గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో హెలీప్యాడ్ నుంచి సభా వేధిక వరకు రోడ్ షోకు సంబందిత ఏర్పాట్లు ఆర్‌ఎంసి మున్సిపల్ కమిషనర్ దినేష్‌కుమార్ పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్యాలరీలకు సంబంధించి వాటర్ ప్యాకెట్స్, అల్పాహారం, మెడికల్ క్యాంపులు ద్వారా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. బహిరంగ సభకొచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ ప్రణాళిక కచ్ఛితంగా అమలు చేయాలన్నారు. ఎస్‌పి సిహెచ్.సుధీర్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిఎం పర్యటనకు సంబందించిన హెలీప్యాడ్, రోడ్ షో, సభావేదిక వద్ద కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తుతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ సౌకర్యం కోసం స్థలాలు గుర్తిస్తున్నాట్లు తెలిపారు జెసి ఎన్.తేజ్‌భరత్ మాట్లాడుతూ కార్యక్రమానికి సంబందించి ప్రజలను తీసుకొచ్చేందుకు 550 ప్రయివేటు, 400 ఆర్‌టిసి బస్సులను ఆయా రూట్స్ వారీ సిద్ధం చేస్తామన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ సిఎం రోడ్ షోకు సంబందించి బారికేడ్ల ఏర్పాటు, ప్రజలకు తాగునీరు, అల్పాహారం అందిస్తామని, సభావేధిక వద్ద ప్రతి గ్యాలరీలో మెడికల్ కిట్స్, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఏలూరు రెంజ్ డిఐజి పాల్‌రాజు, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఎంఎల్‌ఎలు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, వైసిపి రాజమహేంద్రవరం రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, స్థానిక నాయకులు ఎస్.రాజీవ్‌కృష్ణ, మాజీ ఎంఎల్‌సి కోడూరు శివరామకృష్ణ, ఆర్‌డిఒలు ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, డిసిహెచ్‌ఒ డాక్టర్ సనత్ కుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










