Sep 14,2023 23:24

ప్రజాశక్తి - నిడదవోలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 16న నిడదవోలు పట్టణంలో పర్యటిం చనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డా.తానేటి వనిత పిలుపునిచ్చారు. స్థానిక సెయింట్‌ అంబ్రోస్‌ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సిఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లుపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగనన్న మాట ఇచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలిగిందని తెలిపారు. నిడదవోలులో రాష్ట్ర కాపు నేస్తం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జగనన్న కాపు మహిళలకు వినాయక చవితి కానుకగా రూ.15 వేలను కాపు నేస్తం ద్వారా జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలను, ఆర్థిక ప్రయోజనాలను అందించి, వారి ఆర్థిక స్థితగతులను మార్చడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే పలు మార్లు సిఎం పర్యటనను విజయవంతం చేశామని, అదే విధంగా ఈనెల 16 న వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కలెక్టర్‌ డా.కె.మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు సార్లు జిల్లాలో సిఎం పర్యటనను అందరం సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చేయడం జరిగిందన్నారు. సిఎం పర్యటనకు సంబంధించి వివిధ అనుబంధ శాఖల అధికా రులు సమన్వయంతో పనిచేసి తమకు కేటాయించిన విధులను బాధ్యతా యుతంగా నిర్వహించాలన్నారు. సిఎం పర్యటన రోడ్‌ షోలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వర్షం కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని మాధవీలత అన్నారు. ఎంఎల్‌సి, సిఎంకార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘూరాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లాలో అధికారులకు అనుభవం ఉందని ఆ దిశలో అధికారులకు కేటాయించిన విధులను చేపట్టి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, జి.శ్రీనివాస నాయుడు, జెడ్‌పి ఛైర్మన్‌ వి. వేణుగోపాల్‌, ఎస్‌పి పి. జగదీశ్‌, జెసి ఎన్‌. తేజ్‌ భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కేె. దినేష్‌ కుమార్‌, ఎంఎల్‌ఎలు జి. శ్రీనివాస నాయుడు, తలారి వెంకట్రావు, మునిసిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ, ఆర్‌డిఒలు ఎస్‌. మల్లిబాబు, ఎ. చైత్రవర్షిణి, తదితరులు పాల్గొన్నారు.