Apr 23,2023 23:15

సమావేశంలో మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐవి

ఎపి సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర మహాసభలో ఎంఎల్‌సి ఐవి
ప్రజాశక్తి- ధవళేశ్వరం
సహకార సంఘాల ప్రయివేటీకరణపై పోరాటం ఉధృతం చేయాలని, సహకార ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎపి సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర 7వ మహాసభ ఆదివారం బొమ్మూరులోని చెరుకూరి కన్వెన్షన్‌ హాల్లో పివి.సత్యనారాయాయణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ఎంఎల్‌సి ఐవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల్లో 50శాతం వాటాలను ప్రైవేట్‌ వ్యక్తులకు, కంపెనీలకు, ఫండ్స్‌కు కేటాయిస్తూ 1964 సహకార సంఘాల చట్టానికి సవరణ చేసిందన్నారు. మేనేజింగ్‌ కమిటీలోకి వృత్తి నిపుణుల పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులను ప్రవేశపెట్టి ఓటింగ్‌ హక్కును కల్పించిందన్నారు. ఫైనాన్స్‌ బ్యాంకు ప్రతినిధులను కూడా మొదటిసారిగా మేనేజింగ్‌ కమిటీలోకి తీసుకొచ్చి ఓటు హక్కును కల్పించిందన్నారు. రైతుల చేతుల్లో ఉన్న పిఎసిఎస్‌లు ప్రైవేట్‌ వ్యక్తులు కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిఎసిఎఎస్‌లను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నోడల్‌ అధికారిని నియమించిందన్నారు. పిఎసిఎస్‌ల ప్రయివేటీకరణ వల్ల రైతులకు, సహకార సంఘాల్లో పని చేసే ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలపై కత్తి కట్టాయని విమర్శించారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్‌ ఆకులు వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని, పిఎసిఎస్‌ల ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి పెంకె సత్యనారాయణ మాట్లాడుతూ పిఎసిఎస్‌ ఉద్యోగులకు వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సుల అనుసరించి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. 2009లో వేతనాల స్కేల్‌ నిర్ణయిస్తూ 151 జిఒ విడుదలైదన్నారు. దీని అమలు కోసం 2011లో సమ్మెకు ద ఇగాల్సి వచ్చిందన్నారు. 2014 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాల్సి ఉండగా 2019 వరకు వేతన సవరణ లేదన్నారు. 2019లో విడుదలైన జీవో 36 ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజరు కుమార్‌ మాట్లాడుతూ పిఎసిఎఎస్‌ లను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడుతూ సహకార సంఘాల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, రైతులు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో సహకార వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. కొనవుపిరితో ఉన్న సహకార వ్యవస్థను ఉద్యమాల ద్వారా కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు అమరులకు నివాళులర్పించారు. కార్యదర్శి నివేదికను, ఆర్థిక నివేదికను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి తోట వెంకటరామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆదినారాయణ, కెవివి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నలుమూలల నుండి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.