Feb 10,2023 23:36

ఈనో పరిశ్రమ ఎదుట సిఐటియు నాయకులు, సిబ్బంది సంబరాలు

ప్రజాశక్తి - ధవళేశ్వరం
రాజమహేంద్రవరం రూరల్‌లోని సదరన్‌ డ్రగ్స్‌ ఫార్మలో(ఈనో) పరిశ్రమలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో 36 ఓట్ల మెజారిటీతో సిఐటియు బలపర్చిన సదరన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మస్యూటికల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఘన విజయం సాధించింది. శుక్రవారం జిల్లా కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షణలో పరిశ్రమలో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు జరిగాయి. మొత్తం 80 మంది పర్మినెంట్‌ కార్మికులు ఓట్ల ఉండగా 76 ఓట్లు పొలయ్యాయని దీనిలో సిఐటియుకి 56 ఓట్లు రాగా స్వతంత్ర యూనియన్‌కి 20 ఓట్లు పోలయ్యాయి. 36 ఓట్లు మెజారిటీతో సిఐటియు గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి ధృవీకరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణ, బి.పూర్ణిమరాజు కార్మికులకు అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కార్మికులని మభ్య పెట్టి గెలిచిన యూనియన్‌ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు నష్టం చేసే ద్రోహ పూరిత ఒప్పందం చేసిందన్నారు. మూడేళ్ల కాలంలో కార్మికులపై పని భారం, యాజమాన్యం వేధింపులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఐక్యంగా సిఐటియుని తిరిగి గెలిపించారని పేర్కొన్నారు. గతంలో 4 వేతన ఒప్పందాలు సిఐటియు ఆధ్వర్యంలో సదరన్‌ డ్రగ్స్‌ లో జరిగాయని ఇవి కార్మికులకి ఎంతో మేలు చేశాయని సదరన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మస్యూటికల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఖాసీం బీబీ, టి.రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా కార్మిక వర్గానికి మేలు చేసే మంచి వేతన ఒప్పందం చేస్తామని తెలిపారు. వీరికి సర్వరాయ కోకాకోలా బాట్లింగ్‌ యూనిట్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మాచారవు, కోస్టల్‌ పేపర్‌ మిల్లు సిఐటియు అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌, శివరామకృష్ణ వివిధ కార్మిక సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యకురాలు ఖాసీం బీబీ సిఐటియు పతాకాన్ని ఎగురవేశారు. ఈ గెలుపుకు కషిచేసిన నాయకులకు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోకాకోలా యూనియన్‌ నాయకులు పి.అచ్యుత రామయ్య, బి.రాజేశ్వరరావు, సదరన్‌ డ్రగ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.రమేష్‌, జి.శివశంకర్‌, జి.సరోవరం, శోభారాణి, జె.సునీత, కుమారి, దేవి, లలిత, బి.ఆనంద్‌, సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.