సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి - సీతానగరం
కాటవరంలో రూ.2.75 కోట్లు, చినకొండేపూడిలో రూ.2.66 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్ల పనులకు ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో లోవోల్టేజ్ సమస్యల పరిష్కారానికి సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాటవరంంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం వల్ల కాటవరం, మునికూడలి, రాజంపేట, వెదుళ్లపల్లి తదితర ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చినకొండేపూడి సబ్ స్టేషన్ నిర్మాణం వలన రఘుదేవపురం, సీతానగరం, రాపాక, చీపురుపల్లి, అచ్చయ్య పాలెం గ్రామాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. అనంతరం రాజంపేటలో అక్కిన ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఆయన ప్రారంభించారు. అక్కిన ముని కోటేశ్వరరావు, స్థల దాతలు కవల కృష్ణమూర్తి, కవల సురేష్‌లను అభినందించారు. అనంతరం చిన కొండేపూడిలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘుదేవపురంలో పేరంటాలమ్మ సంబరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన 22 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వంగలపూడిలో పునర్నిర్మిస్తున్న రామాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రామచంద్రపురం గ్రామంలో పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఎకరాకు రూ.28 లక్షలు చొప్పున రైతులు అంగీకరిస్తే ప్రభుత్వం పరిహారం అందించడానికి సుముఖంగా ఉందన్నారు. సీతానగరం మండలానికి చెందిన చెరుకూరి వెంకటలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన 50 వేల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుర్రాల జ్యోత్స్న, జడ్‌పిటిసి సభ్యులు సిహెచ్.వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో-కన్వీనర్ కె.హరిబాబు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాబు, సుజీరాజు, గద్దె వెంకటకృష్ణచౌదరి పాల్గొన్నారు.










