ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
భూసార పరీక్షలు అనంతరం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు మేరకు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని జెఎసి ఎన్.తేజ్‌భరత్ పేర్కొన్నారు. గురువారం రాజవోలులో నిర్వహిస్తున్న భూసార పరీక్షా విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 1.40 లక్షల ఎకరాల పంటను రైతులు ఈ-క్రాప్‌లో నమోదు చేయించుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 11,039 భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 4,437 పూర్తి చేశారన్నారు.కౌలు విధానంలో కౌలు రైతులు ఎదుర్కొనే సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకుని ఆధ్యాయనం చేసే ప్రక్రియలో రాజవోలు గ్రామానికి చెందిన రైతు మల్లెపూడి వీర వెంకట ఉదయకిరణ్ కి చెందిన 3.5 ఎకరాలను కౌలుకి తీసుకున్నామన్నారు. ఎంటియు 1,318 రకం వరి వంగడం సాగు చేస్తున్నట్లు తెలిపారు. జీవామృతంతో విత్తనశుద్ధి చేసి సహజ పద్దతిలో వ్యవసాయం చేస్తున్న తెలిపారు. నేల భూసారానికి అనుగుణంగా రసాయిన, సేంద్రీయ ఎరువుల వినియోగం ఉండాలని అధిక మొత్తంలో వినిగించడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వాస్తవంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెట్టుబడి తదితర అంశాలను అధ్యయనం చేయడం కోసం ఈ భూమిని కౌలుకు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొనే దృష్ట్యా భూసార పరిస్థితులను తెలుసుకున్నానని తెలిపారు.
జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ మట్టినమూనాలను వేసవిలో తీయడం మంచిదని, పంట వేసే ముందు కోసిన తరువాత కూడా మట్టి నమూనాలను సేకరించవచ్చునన్నారు. మాగాణి భూముల్లో నీరు పెట్టక ముందే నమూనాలను తీయవచ్చునన్నారు. ఎరువులు వేసిన భూముల్లో నెల రోజులు తదుపరి మాత్రమే మట్టి నమూనాలను సేకరించాలని ఆయన పేర్కొన్నారు. జెసి వెంట రైతు ఉదయకిరణ్, ఇతర సిబ్బంది ఉన్నారు.










