Aug 02,2023 00:25

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి నది వరద శాంతించింది. గడిచిన 24 గంటలుగా క్రమ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలోనూ వర్షాలు తోడవటంతో గత కొన్ని రోజులుగా వరద ఉధృతి క్రమ క్రమంగా పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు 28.70అడుగుల నీటిమట్టం నమోదైంది. 24 గంటల క్రింత అక్కడ 39.90 అడుగుల నీటిమట్టం నమోదైన విషయం విదితమే. సుమారు 11.20 అడుగులమేర నీటిమట్టం తగ్గింది. క్రమ క్రమగా తగ్గుముఖం పట్టడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లోని పరివాహక ప్రాంత ప్రజలు కొంత ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద10.70అడుగుల నీటిమట్టం నమోదైంది. 24 గంటల క్రితం అక్కడ 14.60 అడుగుల నీటిమట్టం నమోదైన విషయం విదితమే. 3.90 అడుగుల నీటిమట్టం తగ్గింది. మధ్యాహ్నం 1 గంటలకు 11.70 అడుగునీటిమట్టం నమోదై ప్రవాహ వేగం తగ్గటంతో మొదటి ప్రమాద హెచ్చరికను మధ్యాహ్నం 2 గంటలకు ఉపసంహరించినట్లు బ్యారేజీ హెడ్‌ వర్క్‌ ఎఇ కాశీ విశేశ్వరరావు ప్రకటించారు. అక్కడి 175 గేట్ల ద్వారా మిగులు జలాలు 8.93లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రానికి విడుదల చేస్తున్నారు.తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 13.93 మీటర్లు నీటి మట్టం ఉంది. గత 10 రోజులుగా వరద ప్రవాహం తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగింది. నది వరదకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడవటంతో ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమై మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. కాటన్‌ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల ఎత్తున నీటిమట్టం చేరితే అధికారుల గణాంకాల ప్రకారం కొనసీమ జిల్లాల్లో 7 గ్రామాలు, 13.75 అడుగులకుచేరితే 13 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా. అయితే క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించేప్పటికీ పలు కాజ్‌వేలు ముంపునకు గురవటంతో లంక గ్రామాల రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తాయి. రెండోప్రమాద హెచ్చరిక జారీ చేసేప్పటికి సుమారు 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు, అధికారులు పడవలపై రాకపోకలు చేశారు. మరో వైపు బలహీన ఏటిగట్లు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఏడాది క్రితం కోనసీమలో సిఎం జగన్‌ పర్యటించారు. అనేక హామీలు గుప్పించారు. గడిచిన ఏడాదిగా హామీలు ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట లభించింది. తిరిగి మళ్లీ ఈ నెలలో వరదలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించిన గతంలో ఇచ్చిన హామీలు అచరణలో అమలు చేయాలని కోరుతున్నారు.