Sep 16,2023 23:14

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాక ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వంగా... కాపు సోదరులకు రెండు క్యాబినెట్లలో, ఒక్కో క్యాబినెట్‌లో నలుగురు మంత్రులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి నా పక్కనే కూర్చొబెట్టుకున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. నాలుగో విడత 'వైఎస్సార్‌ కాపు నేస్తం' కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,55,845 మంది మహిళలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని నిడదవోలులో శనివారం నిర్వహించిన బహిరంగ వేదిక నుంచి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సిఎం వైయస్‌.జగన్‌ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి 'మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 5 మంది మంత్రులు పక్కనే కనిపిస్తారు. ఉపముఖ్యమంత్రి పదవుల్లో ఒక బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీతో పాటు నా కాపు సోదరుడు కనిపిస్తాడు. కారణం ఇది మీ అందరి ప్రభుత్వం' అన్నారు.
నిడదవోలు ఎంఎల్‌ఎ శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నిడదవోలుకు సిఎం జగన్‌ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సభలో నిడదవోలు ఎంఎల్‌ఎ అడిగిన హామీలు అమలుకు సిఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆమోదిస్తూ ప్రకటించడం పట్ల ప్రజలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విజ్జేశ్వరం నుంచి సిద్దాతం వరకు కెనాల్‌ రోడ్డుకు రూ.66 కోట్లు, చిన్న కాశీ రేవు వంతెన కోసం రూ.4.65 కోట్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ అభివద్ధికి చేసే దిశలో 100 పడకల ఆసుపత్రిగా పెంపునకు రూ.19 కోట్లు, బిఆర్‌ అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌, బిసి కమ్యూనిటీ హాల్‌, మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలు, షాదీఖానా అభివృద్ధి నిర్మాణాల కోసం నిధుల కేటాయింపునకు హామీ, విజ్జేశ్వరం ఏటిగట్టు సిద్దాంతం వరకు రోడ్డుకు, ఆటో నగర్‌ అభివద్ధి కోసం, ఉండ్రాజవరం మండలం వడ్లూరు నుంచి అత్తిలికి కాలిబాట వంతెన నిర్మాణం కోసం నిధులు, నిడదవోలు ఆర్టీసి డిపో అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 31,389 మంది లబ్ధిదారులకు రు.47 కోట్లను ఖాతాలకు జమ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కష్ణ, కొట్టు సత్యనారాయణ, డాక్టర్‌ తానేటి వనిత, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్‌పి చైర్మన్లు విప్పర్తి వేణుగోపాల్‌, ఘంటా పద్మవతి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎంపీలు మార్గాని భరత్‌ రామ్‌, కోటగిరి శ్రీధర్‌, వంగా గీత, మిథున్‌ రెడ్డి, ఎంఎల్‌సిలు తలశిల రఘురాం, వంకా రవీంద్రనాధ్‌, కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇస్రాయిల్‌, కవురు శ్రీనివాస్‌, ఎంఎల్‌ఎలు జి.శ్రీనివాస నాయుడు, జక్కంపూడి రాజా, సత్తి సూర్య నారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, ఆళ్ల కాళీకష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.