Jun 19,2023 00:18

ప్రజాశక్తి-కడియం
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సస్యశ్యామలం కొరకు, ప్రజలకు తాగునీరు అందించు నిమిత్తం ఆనాడు మహనీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ దొర చేసిన కషి ఫలితం తాలూకు ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికంతటికీ కారణమైన ప్రధాన కాలువల ఆధునికీకరణ లేదు.. అభివద్ధి అస్సలే లేదు. అతి ముఖ్యమైన లాకులు కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరి, మరికొన్ని చోట్ల తీరని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
గోదావరి తూర్పుడెల్టా ప్రధాన కాలువపై కడియం వద్ద గల పాత, కొత్త లాకులు పలు తీరని సమస్యలతో సతమతమవుతున్నాయి. పలు సమస్యలు దీర్ఘకాలంగా తిష్టవేసి దర్శనమిస్తున్నాయి. పాత లాకుల పరిధిలో కాకినాడ ప్రధాన కాలువ, మండపేట ప్రధాన కాలువల ద్వారా సుమారు 94 వేల 284 ఎకరాలకు సాగునీరు అందురyంది. కొత్త లాకుల పరిధిలో సామర్లకోట ప్రధాన కాలువ ద్వారా సుమారు 62,453 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ పరిధిలో అనేక ఆయకట్టు చెరువులు, తాగునీరు చెరువులు కూడా ఉన్నాయి. సుమారు 1లక్షా 57 వేల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న ఇంతటి ప్రాధాన్యత గల లాకులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకొనే నాధుడు కరువయ్యాడు. ఎన్నిసార్లు విన్నవించినా ఎంత మొరపెట్టుకున్నా అధికారులు, పాలకులు కనీసం స్పందించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో లాకుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు..
పాడైన కొత్త లాకుల ప్లాట్‌ ఫామ్‌
కొత్త లాకుల ప్లాట్‌ ఫామ్‌ పగుళ్లు ఏర్పడి, రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరింది. ఈప్లాట్‌ ఫామ్‌ మీదుగా మాధవరాయుడుపాలెం, కడియపుసావరం గ్రామాల రైతులు తమ పొలాలకు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. వివిధ ప్రాంతాలకు చదువుల నిమిత్తం వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు పగలు, రాత్రి తేడాలేకుండా నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. గత 4, 5 సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కావడంలేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
ఆపరేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ పరిస్థితి అంతే
సిబ్బంది విధులు నిర్వహించే ఇనుప ఆపరేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ తుప్పుపట్టి, రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. లాకుల్లో దిగువకు నీటి ప్రవాహాన్ని తగ్గించి, పెంచే సమయాల్లో ఈ ప్లాట్‌ ఫామ్‌ ద్వారానే విధులు నిర్వహించాలని, స్లూ గేర్‌ బేరింగ్స్‌, షట్టర్స్‌ కూడా పాడవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. అలాగే లాకుల ప్రాంతంలో ఏవిధంగానూ నయాపైసా ఆదాయం సమకూరడంలేదని, కరెంటు బిల్లులు కూడా తమ చేతి డబ్బులు చెల్లిస్తున్నామని, శాశ్వత సిబ్బంది లేక నిర్వహణ భారంగా మారిందని లాకు సూపరింటెండెంట్‌ అంటున్నారు.
శిథిలావస్థకు చేరిన నావిగేషన్‌ ఛానల్‌ గేట్లు
పాత లాకుల్లోని నావిగేషన్‌ ఛానల్‌ పూర్తిగా మూసివేయడంతో సిల్ట్‌ పేరుకుపోయి, రైతులు పశుగ్రాసం పెంచుకుంటున్నారు. అలాగే కొత్త లాకుల్లో నావిగేషన్‌ ఛానల్‌ గేట్లు పూర్తిగా పాడయ్యాయి. దీనివల్ల లాకుల దిగువకు నీరు అవసరం ఉన్నా , లేకున్నా అన్నివేళలా ప్రవహిస్తూ , వథాగా పోతోంది. పూర్వం కాలువల ద్వారా పడవల్లో వివిధ సామగ్రి రవాణా, నావల ద్వారా ఇసుక రవాణా జరగడంతో కీలకమైన నావిగేషన్‌ ఛానళ్లు నేడు నిరుపయోగంగా మారాయి. వీటి ద్వారా ప్రస్తుతం రవాణా జరగడం లేదని, ఏ విధమైన ఉపయోగం లేదని అందుకే నిరుపయోగంగా వదిలేశారని సిబ్బంది అనడం కొసమెరుపు.

ఇబ్బందులు లేకుండా సాగు,తాగునీరు అందించే ఏర్పాటు
కడియం లాకుల్లోని వివిధ మరమ్మతులకు సంబంధించి ఆర్థిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాము. నిధులు మంజూరైన వెంటనే టెండర్లు ద్వారా పిలిచి, పనులు చేపట్టి పూర్తిచేస్తాం. నావిగేషన్‌ ఛానళ్లకు సంబంధించి మోడెరైజేషన్‌ పరిధిలోని అంశం అని, వాటి యొక్క పనులకు సంబంధించిన ప్రపోజల్స్‌ కూడా పంపించాం. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగు, తాగు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాము.
-జి.రవికుమార్‌ , ఇరిగేషన్‌ డిఇఇ, కాకినాడ