ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మొన్నటి వరకు వర్షాలు లేక దిగాలు పడిన రైతులు ఉత్సాహంతో పొలాల్లోకి దిగారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జోరుగా వరి నాట్లు సాగుతున్నాయి. జూన్‌లో వర్షాలు ముఖం చాటేసినా తాజాగా వర్షాలు పడడంతో చెరువులు, కుంటల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరింది. జిల్లాలోని దాదాపు చిన్న, పెద్ద చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కొన్ని మండలాల్లో వర్షాలు ఆగడంతో రైతులు నాట్లు వేయడానికి నడుం బిగించారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా పొలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తూ, సాగుకు భూమిని సిద్ధం చేస్తూ కనిపిస్తున్నారు. ఆరుతడి పంటలకు ఇబ్బంది లేకుండా పోవడంతో అన్నదాతలు నిబ్బరంగా పొలం పనుల్లో మునిగిపోయారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నార్లు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలతో అనువైన వాతావరణం ఏర్పడడంతో జోరుగా వరి నాట్లు పడుతున్నాయి. దీంతో పల్లెల్లో ఎటు చూసినా వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో వైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు రావటంతో ఆయకట్టు రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు మరో లక్ష ఎకరాల్లో పంటలు సాగుకావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బోరు బావులున్న రైతులు వాటి కింద ఇప్పటికే వరినాట్లు వేశారు. చెరువుల కింద సేద్యం చేసే రైతులు నార్లు పోసి సిద్ధంగా ఉంచుకున్నారు. నెల రోజుల క్రితం పోసిన నారు నాటే దశకు చేరింది. దీంతో రైతులు నారు పీకించి వరినాట్లు వేయిస్తున్నారు. కాల్వల కింద నీటి విడుదల కావడంలో ఆలస్యం జరగడం వల్ల అలాంటి రైతులు ఇతర ప్రాంతాల నుంచి నారును కొనుగోలు చేసుకుని నాట్లు వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరుగా వర్షం కురిసినా ఆ తర్వాత ముఖం చాటేయ్యడంతో రైతులు కలవర పడ్డారు. ఇప్పుడు పుష్సలంగా వర్షాలు కురవడంతో అనుకూల పరిస్థితులు ఏర్పడి నాట్లు ముమ్మరమయ్యాయి. వర్షాల రాక 25 రోజుల ఆలస్యం అయినందు వల్ల ఎక్కువ మంది రైతులు స్వల్పకాలిక రకం వరి వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు నాట్లు వేస్తుండగా మరికొంత మంది సమయం కలిసి రావడానికి పొల్లాల్లో విత్తనాలను నేరుగా జల్లుతున్నారు. ఆగస్టు మొదటి వారం వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. బావుల కింద ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఇప్పుడు ఎరువులు చల్లుతున్నారు.
గ్రామాల్లో ముమ్మరంగా వ్యవసాయ పనులు
వర్షాల రాకతో గ్రామాల్లో ఖరీఫ్ వ్యవసాయ పనుల సందడి మొదలైంది. పనులు మొదలు కావడంతో పొలాలు దున్నే ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్ పెరిగింది. కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు మండలాల్లో 95 శాతం నాట్లు పూర్తయ్యాయి. అగస్టు ఐదో తేదీ నాటికి వరినాట్లు 100 శాతం పూర్తవుతాయని అదికారులు అంచనా వేస్తున్నారు. ఎకరాకు రూ.2 వేల నుంచి రూ. 2500 వరకు నాట్లు వేసే కూలీలకు చెల్లిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. టమోటా కిలో రూ.100 దాటి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. జిల్లాలో 35 వేల ఎకరాల్లో కూరగాయల పంట సాగవుతోంది. వర్షాలు అనుకూలంగా ఉండటం, ధరలు పెరగడంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూరగాయల సాగు పెరిగే అవకాశాలు నెలకొన్నాయి.










