ప్రజాశక్తి-కడియం : 2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి చేసిన వాగ్ధానాలలో కొన్నింటిని ప్రస్తుత ఎలక్షన్ల ముందు ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నాలు చేస్తుందని, దీనిలో ఉద్యోగ సంఘాలు చేసింది ఏమీ లేదని, ఈ విషయం ఉద్యోగులు , ప్రజలు గ్రహించాలని ఎపి ఎస్.సి/ఎస్.టి/బి.సి మైనారిటీ ఎంప్లాయిస్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్ అన్నారు. ఉద్యోగ సంఘాలలో కొందరు భజన సంఘాలుగా ఏర్పడి వారేదో సాధించినట్లుగా , ఉద్యోగుల తరపున పోరాటాలు చేసినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని, అటువంటి భజన సంఘాల నాయకులను దూరంగా పెట్టాలని ఉద్యోగులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను తీర్చాల్సివుందని, అలాగే వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సివుందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయాలని, పెండింగ్ లో ఉన్న డి.ఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతినెలా మొదటి తారీఖున సక్రమంగా జీతాలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో భజన చేసే సంఘాలను దూరంగా పెట్టాలని, ఒకసారి వారి గత చరిత్ర చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, వాస్తవాలను వెలిబుచ్చే ఉద్యోగ సంఘ నాయకుల రెప్రజెంటేషన్ లను పరిగణనలోనికి తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.










