ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలోని 36,816 స్వయం సహాయ సంఘాల్లోని 3,95,844 మంది సభ్యులకు సున్నావడ్డీగా రూ.53.81 కోట్ల లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అమలాపురంలో శుక్రవారం ప్రారంభించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాధవీలత, జెసి తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 36,816 స్వయం సహాయ సంఘాల్లోని 3,95,844 మంది సభ్యులకు సున్నావడ్డీగా రూ.53.81 కోట్లను బ్యాంకు ఖాతాలకు జమేశామన్నారు. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని సభ్యులకు వడ్డీ భారం పడకుండా వారి తరపున ప్రభుత్వమే ఆ వడ్డీని 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ' కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో రీయింబర్స్ చేస్తుందన్నారు. సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న స్వయంసహాయక మహిళలకు నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదనపు ఆదాయం సమకూర్ఛేదుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ అదనపు కమిషనర్ పిఎం.సత్య వేణి, డిఆర్‌డిఎ పీడీ ఎస్.సుభాషిణి, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.










