ప్రజాశక్తి-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజాం పట్టణంలోని ప్రధాన రహదారి పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం రాజాంలో సిపిఎం ఆధ్వర్యాన రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని రహదారులు పల్లెటూర్లో ఉన్న రహదారుల కంటే అధ్వానంగా ఉన్నాయని, రోడ్లు విస్తరణ పేరుతో గత సంవత్సర కాలంగా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగి చాలామంది పలువురు గాయ పడుతున్నారని తెలిపారు. వర్షాకాలం వస్తే రోడ్లు మీద అసలు నడిచే పరిస్థితి లేదని, ప్రజలు, ప్రయాణికుల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారని అన్నారు. తక్షణమే రోడ్లు విస్తరణ పనులు పూర్తిచేయకపోతే ప్రజలంతా పోరాటానికి సన్నద్ధమవు తారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.శంకర్రావు, రామ్మూర్తి నాయుడు, తిరుపతిరావు, సత్యారావు, రమణ, విశ్వనాథం పాల్గొన్నారు.