ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వారధి రోడ్డు కం రైలు వంతెనపై రాకపోకలను నిషేధిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 26 వరకూ ఎటువంటి వాహనాలను అనుమతి లేకుండా మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ మరమ్మత్తుల కోసం రూ.2.10 కోట్లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదివారం వెల్లడించారు. అమరావతి నుంచి అరసవిల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర గత ఏడాది అక్టోబర్‌లో కొవ్వూరు నుంచి రోడ్డు కం రైలు వంతెన మీదుగా రాజమహేంద్రవరం నగరంలోకి అడుగుపెట్టేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో రోడ్డు కం రైలు వంతెనపై మరమ్మత్తుల పేరుతో పది రోజులపాటు రాకపోకలను నిలుపుదల చేశారు కేవలం అమరావతి రైతుల పాదయాత్రను రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి రాకుండా చేసేందుకే మరమ్మత్తుల పేరుతో రాకపోకలను నిషేధించారనే ఆరోపణలను జిల్లా అధికార యంత్రాంగం ఎదుర్కొంది. నాడు వచ్చిన ఆరోపణలకు అనుగుణంగానే రోడ్డు కం రైలు బ్రిడ్జిపై తూతూమంత్రంగా పనులు చేపట్టి మమా అనిపించారనే విమర్శలు లేకపోలేదు. ప్రస్తుతం సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. ఈ బ్రిడ్జిపై మరమ్మత్తులు చేపట్టేందుకు ఆర్ అండ్ బి అధికారుల సూచనతో పూర్తిగా ట్రాఫిక్‌ను మళ్లింపు చేయాల్సివస్తుందని వివరించారు. 'రోడ్ కం రైల్ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టడానికి వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా బిటి క్యారేజ్‌వే పునరుద్ధరణ 0.00 కి. మీ.ల నుంచి 4.473 కి.మీ.ల పొడవు దెబ్బతిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్‌లకు చెందిన ప్రత్యేక మరమ్మత్తులు చేపడతారని తెలిపారు.










