ప్రజాశక్తి-విజయనగరం : రక్త హీనతను నివారించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. పదిహేను రోజుల్లోగా కౌమార బాలికలందరికీ హీమోగ్లోబిన్ రక్త పరీక్షలను పూర్తి చేసి, అవసరమైన వారికి మందులను అందించాలని ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసులు, గర్భిణులు, కౌమార బాలికల్లో రక్తహీనత తదితర అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులు, వైద్యులు, ఎఎన్‌ఎంలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా జగనన్న ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసులన్నిటీకి వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. కొన్ని పిహెచ్‌సిల పరిధిలో కనీసం 20 శాతం కేసులకు కూడా వైద్యం అందించకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిఫరల్ కేసుల్లో రోగులను తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. ప్రతీ రోగినీ సమీప సిహెచ్‌సి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లేదా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. వారి రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వైద్యం అందించిన తరువాత ఇకెవైసి నమోదు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,439 రిఫరల్ కేసులు నమోదు చేయగా, ఇప్పటివరకు 569 మందికి మాత్రమే వైద్యం అందిందని, మిగిలినవారికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఐరన్, సుక్రోజ్ ఇంజక్షన్ల కోసం గర్భిణులను అవసరమైతే తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లలో ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎస్.భాస్కరరావు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ గౌరీశంకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల, జిజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పిఎ రమణి తదితరులు పాల్గొన్నారు.