- గోదావరి గట్టు రాజబాబు విగ్రహం వద్ద పలువురి నివాళి
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : తెలుగు సినీ వినీలాకాశంలో అలరారించి, విభిన్నమైన శైలితో ఓ ప్రత్యేక ముద్రవేసి ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయిన నటుడు రాజబాబు అని వక్తలు కొనియాడారు. నవ్వుల రారాజు, ప్రముఖ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక శుక్రవారం ఉదయం గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1936 అక్టోబరు 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు,రవణమ్మ దంపతులకు రాజబాబు జన్మించారని, ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు, ఐదుగురు చెల్లెళ్ళని, రాజబాబు అసలుపేరు పుణ్యమూర్తుల అప్పలరాజు అని పేర్కొన్నారు. రాజబాబు 1960లో సమాజం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి 600 చిత్రాల్లో నటించి మెప్పించారని తెలిపారు. తన నటనతో వరుసగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది పురస్కారాలు, మరెన్నో అవార్డులు అందుకున్నారని వివరించారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజబాబు అని కొనియాడారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇచ్చారని, కోరుకొండలో జూనియర్ కాలేజి కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజబాబు ప్రతిసంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటులను, నటీమణులను సత్కరించేవారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన బాలకృష్ణ(అంజి)ని సత్కరించేవారు. సత్కారం పొందిన వారిలో జగ్గయ్య, డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, రేలంగి, సావిత్రి మొదలైన వారు ఉన్నారు..తన చుట్టూ ఉన్న వారిని సదా నవ్విస్తూ, కవ్విస్తూ సాగిన రాజబాబు 1983 ఫిబ్రవరి 14 న హైదరాబాద్ లో చివరి శ్వాస విడిచి మన నుంచి దూరమయ్యారని సోదరుడు బాబి తెలిపారు. జయంతి కార్యక్రమంలో రాజబాబు మేనల్లుడు బి.ఎస్.ఎన్.ఎల్. వాసు, రాజబాబు మిత్ర బృందం బాబు స్టూడియో అధినేత ముసిని వెంకటేశ్వరరావు(బాబులు), మల్లుల శ్రీనివాస్, బాబి, మల్లుల కిరణ్, కట్టా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిస్కెట్లు పంపిణీ చేశారు.










