Oct 06,2023 23:41

రైతులతో మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత

మంత్రి వద్ద పలువురు రైతుల ఆవేదన
ప్రజాశక్తి - తాళ్లపూడి
రీ సర్వే తర్వాత తమ భూములకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ లెక్కల్లో కనిపించట్లేదని, దీనిపై తమకు న్యాయంచేయాలని పోచవరం గ్రామానికి చెందిన పలువురు రైతులు హోం మంత్రి తానేటి వనిత వద్ద వాపోయారు. జగనన్న సురక్ష కార్యక్రమం నిమిత్తం పోచవరం వచ్చిన మంత్రి వనితను రైతులు కలిసి వారి ఇబ్బంలను తెలిపారు. మంత్రి స్పందించి వెంటనే అధికారులను పిలిచి ఆరా తీశారు. ఈ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం జెసి వద్ద ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై రైతులు మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ సమయంలో తమ పొలాలు తీసుకుంటామని అధికారులు చెప్పారని, తరువాత మళ్లీ మార్పు చేశారన్నారు. దీనిపై 2015లో కోర్టును ఆశ్రయించగా తీర్పు కూడా తమకు అనుకూలంగానే వచ్చిందన్నారు. తమ భూముల్లో తామే వ్యవసాయం చేసుకుంటున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 22 మందికి రైతులకు సంబంధించిన పది ఎకరాల భూమి రీ సర్వే అనంతరం రికార్డుల్లో లేదన్నారు. మంత్రిని కలిసిన వారిలో రామారావు కాకర్ల విష్ణుమూర్తి, చెరుకూరి సత్యనారాయణ తదితర రైతులు ఉన్నారు.