ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి రాజమహేంద్రవరం ప్రతినిధి
ధాన్యం కొనుగోలులో తేమ, తాలు సాకుగా చూపించి రైతుల నుంచి నగదు వసూలు చేస్తున్న రెండు రైస్ మిల్లులపై కలెక్టర్ మాధవీలత చర్యలు చేపట్టారు. ఈ నెల 10న ప్రజాశక్తి మెయిన్‌లో 'క్వింటాకు ఆరు కిలోల తరుగు' శీర్షికతో కథనం ప్రచురితమైంది. మరోవైపు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం, ధారవరంలో రెండు రైసు మిల్లులను ఉన్నతాధికారులతో తనిఖీలు చేయించారు. యాజమాన్యం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో ధాన్యం సేకరణ చేసే ప్రక్రియ నుంచి వాటిని తొలగించారు. ఈ మేరకు కలెక్టర్ కె. మాధవీలత, జెసి ఎన్.తేజ్‌భరత్ గురువారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ధాన్యం సేకరణలో రైతుల నుంచి మిల్లర్లు ఎవ్వరూ డబ్బులు వసూలు చేయరాదన్నారు. అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రాహ్మణ గూడెంలో సూర్య దత్త ట్రేడర్స్, ధారవరంలో శ్రీతేజా ఏజెన్సీస్‌లో డబుబ్లఉ వసూలు చేసినట్టు రుజువు కావడంతో వాటిని కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్‌సేకరణ పక్రియ నుంచి తొలగించామన్నారు.










