Jun 01,2023 23:16

శ్యామలా సెంటర్‌లో ధర్నా నిర్వహిస్తున్న కేంద్ర కార్మిక సంఘాలు

ప్రజాశకి - రాజమహేంద్రవరం ప్రతినిధి
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల నిందితుని కాపాడుతున్నది మోడీయేనని పలువురు నాయకులు అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌ సింఫ్‌ును తక్షణం అరెస్టు చేయాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని, నిరసన తెలియజేసే రాజ్యాంగ హక్కుని కాపాడాలని కోరుతూ కేంద్ర కార్మికసంఘాలు ఆధ్వ ర్యంలో శ్యామల సెంటర్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా అధ్యక్షులు సుందరబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు కె.జోజి, కాంగ్రెస్‌ నాయకులు మురళీధర్‌ మాట్లాడారు. 50 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున రెజ్లర్లు పోరాడుతున్నారన్నారు. 38 కేసుల్లో హత్య, కిడ్నాప్‌, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, మోడీ ప్రభుత్వం కాపాడుతున్నాయన్నారు. బ్రిజ్‌భూషణ్‌ తన కుటుంబ పరివారాన్ని మొత్తం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఉన్నత స్థానాల్లో నియమించి తన కనుసన్నల్లో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నడిచేలా ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. తక్షణం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ప్రపంచ పోటీల నుంచి బహిష్కరిస్తామని ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య సైతం హెచ్చరికలు చేసిందన్నారు. మహిళా రెజ్లర్లకు అందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జీవితాంతం కష్టపడి సాధించిన మెడల్స్‌ను సైతం గంగానదిలో కలపాలని రెజ్లర్లు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం మహిళల పట్ల పభుత్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుధర్మ శాస్త్రం ప్రకారం బిజెపి ప్రభుత్వం పాలిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక వైఖరితో దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మంట కలుపుతున్నారన్నారు. తక్షణం లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కార్పొరేట్‌ కనుసన్నల్లో నడిచే జాతీయ మీడియా మహిళా రెజ్లర్ల పోరాటాన్ని విస్మరించడం, మోడీ ప్రభుత్వానికి భయపడి ప్రసారం చేయకపోవడం భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులు కార్మికులు, విద్యార్థులు సంఘాలతో కలిసి ఉధృత రాటాలు నిర్వహిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, కె.రామకృష్ణ, మాణిక్యంబ, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎం.మాధవ్‌, ఐఎఫ్‌టియు నాయకులు డి.శ్రీనివాసరావు, ఎన్‌.దుర్గారావు, సిఐటియు నాయకులు పి.రామకృష్ణ, ఆనంద్‌, ఝాన్సీ, శ్యామల, పాల్గొన్నారు.
కొవ్వూరు రూరల్‌ : బస్టాండ్‌ సెంటర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు మాట్లాడారు. మహిళా రెజ్లర్లకు అందరూ అండగా ఉండాలన్నారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హోల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యంబ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుధర్మ శాస్త్రం ప్రకారం బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తుందనడానికి రెజ్లర్ల ఘటన ఒక ఉదాహరణ అన్నారు. విశ్రాంత ఉద్యోగుల నాయకులు పెనుమక జయరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.శ్రీదేవి, చిన్నలక్ష్మి, శాంత కుమారి, సువిత, మణి, ముత్యం, మునికాంతం తదితరులు పాల్గొన్నారు