ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఈ బారాల రేషన్ బండిని తాము నడపలేమంటూ రేషన్ సరుకులు సరఫరా చేస్తున్న ఎండియులు వాపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణమని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పంపిణీ ఎండియు నిర్వాహకలను అప్పుల్లో ముంచేస్తోంది. తాజాగా వాహనాలకు సంబంధించి వార్షిక ఇన్సూరెన్స్ చెల్లింపులపై గందరగోళం నెలకుంది. ఇన్సూరెన్స్ పేరుతో జనవరి నెల వేతనంలో రూ 11,000 మైనస్ బ్యాలెన్స్ చూపించడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉన్నతాధికాలను కలిసి మినహాయింపు ఇవ్వాలని తాము చెల్లించలేమని విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కొంతమందికి పోరాట లభించిన లోను ఖాతాలో జమ చేసుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఓవైపు చాలీచాలని వేతనాలు మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి మొత్తం మీద రేషన్ బండ్లు తమకు గుదిబండల మారాయని ఎండియూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండియూ ఆపరేటర్లలో అత్యధికమంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే అటువంటి వారి సైతం తాజా పరిణామాలపై పెదవిరుస్తున్నారు. ఒక్కొక్కరుగా అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల్లో ఎండియులు
రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు నేరుగా ఇంటికే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డోర్ టూ డోర్ రేషన్ పథకాన్ని 2022 జనవరి 22న లాంఛనంగా ప్రారంభించింది. మొబైల్ వ్యాన్ల ద్వారా ఆయా ప్రాంతాలకు రేషన్, ఇతర నిత్యవసర వస్తువులను కార్డుదారుల ఇంటికే తీసుకెళ్లి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 1000 వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం యూనిట్ ధర రూ.5.81 లక్షలు. సబ్సిడీ రూ.3,48,600, బ్యాంకు రుణం రూ.1,74,350 ఇచ్చింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఇబిసి కార్పొరేషన్ల ద్వారా వాహనాలను అందజేసింది. లబ్ధిదారుని వాటా రూ.58 వేలు కాగా ఒక్కొక్కరూ రూ.63,200లు చెల్లించారు. ప్రభుత్వం తొలుత పది రోజులు మాత్రమే పని ఉంటుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో 15 రోజులు విధులు నిర్వహించాల్సి ఉంది. కొన్నిచోట్ల రేషన్ డీలర్లు సహకరించక పోవడంతో పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందించలేని పరిస్థితి (కేవలం బియ్యం, కందిపప్పు, పంచదార మాత్రమే పంపిణీ) నెలకొంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ప్రత్యక్షంగా కనిపించే తమను విమర్శిస్తున్నారని ఎండియులు వాపోతున్నారు. ఇద్దరు రేషన్ డీలర్ల పని ఒక ఎండియు ఆపరేటర్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు
డ్రైవర్‌కు రూ.21 వేల వేతనాన్ని ఇస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. అయితే ఇప్పటికీ అత్యధిక మందికి కేవలం రూ.18000 మాత్రమే ఇస్తున్నారని ఎండియులు చెబుతున్నారు. హమాలీ ఖర్చు, పెట్రోల్, డీజల్, మెయింటెనెన్స ఖర్చులు తీసేస్తే కనీసం రూ.3 వేలు కూడా మిగలడం లేదని వాపోతున్నారు. పెట్రోల్ బండ్లు లీటర్ మైలేజీ కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే వస్తుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ ధర రూ.109 దాటిందని, హమాలీ కూలీ రూ.500 ఇచ్చినా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. మరోవైపు ప్రతినెలా వేతనం మరుసటి నెల ఆఖరున ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో ఇఎంఐలు బకాయిలు ఉండిపోయి సిబిల్ స్కోర్ నేల చూపులు చూస్తోందంటున్నారు. దీంతో కొత్తగా అప్పులు దొరికే పరిస్థితి కనపడడం లేదు. తాజాగా మిడ్ డే మీల్స్, అంగన్‌వాడీ సెంటర్లకు రేషన్ సరుకులు తరలించే బాధ్యతను ప్రభుత్వం ఎండియు ఆపరేటర్లకు అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆదాయం కల్పించడం లేదు. ఈ బస్తాలు మోయలేక తమకు వాహనాలు వద్దంటూ గత ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 44 మంది రేషన్ వాహనాలను తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అధికార యంత్రాంగం జోక్యంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. తాజా సమస్యలను చక్కదిద్దకపోతే గత పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.










