Mar 27,2023 22:40

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వరి సేకరణ కార్యాచరణ, 10వ తరగతి పరీక్షా ఏర్పాట్లు, స్పందన గ్రామ, వార్డ్‌ సచివాలయ అంశాలు, వేసవి కాలంలో తాగునీటి సరఫరా సమస్యలపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
జిల్లాలో ముందస్తుగా కోతలు వచ్చే అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో రోజువారీ ఎంత ధాన్యం వస్తుందో అంచనాతో ఉండాలన్నారు. జిల్లాకు 70 లక్షల గన్నీ బాగ్స్‌ అవసమని, అందుకు తగ్గట్టుగా ఏ మండలానికి ఎన్నిఅవసరమో ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో రబీ సీజన్లో 4,55,845 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 18 మండలాల్లో 315 ఆర్‌బికెల పరిధిలో 233 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 147 మిల్లులకు అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు 126 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు జెసి తెలిపారు. 26,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, జిల్లావ్యాప్తంగా 21 స్టోరేజ్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి సెంటర్‌లో ఫర్నిచర్‌, ఫ్యాన్స్‌, లైట్స్‌, నిరంతర విద్యుత్‌, టాయిలెట్స్‌ నిర్వహణ, వేసవి దృష్ట్యా శుద్ధమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
రానున్న వేసవి దష్ట్యా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ప్రణాళిక బద్ధంగా రూపొందించిన కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. చెరువులు, బోరు పంపులు ముందుగానే మరమ్మతులు చేశారని, ఇంకా ఉంటే యుద్ధప్రాతిపదికన రిపేర్లు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉండే నేపథ్యంలో స్థానికంగా దాతల సహకారంతో చలి వేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఆధార్‌ నవీకరణకు సంబంధించి 2016 నుంచి తదుపరి నవీకరణ చేసుకొని వారు తప్పనిసరిగా 28, 29 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ కేంద్రాల్లోయ నవీకరణ చేసుకోవాలన్నారు.