ప్రజాశక్తి - యంత్రాంగం
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టిడిపి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం నిరసనలు జరిగాయి. అనంతరం తహశీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. గోకవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి మండల అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహశీల్దార్ ఎ.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడప భరత్‌బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల రాము, వైసిపి మండల అధ్యక్షుడు చింతల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట పాడైపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంట నీటిలో తడిసిపోవడంతో తీవ్ర నష్టాలకు గురయ్యారన్నారు. అయినా వైసిపి ప్రభుత్వం నిమ్మకు నిరీత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా దెబ్బతిన్న, రంగు మారిన ధాన్యాన్ని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలన్నారు. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పిడుగు పాటుకు గురై మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలాన్నరు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులను ఆదుకుని, వారికి పరిహారం చెల్లించాలని నినదించారు. అనంతరం తహశీల్దార్ జి.కనకరాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ మాట్లాడారు. పది రోజులుగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట చేజారిందన్నారు. చేలో నీరు నిలవడంతో ధాన్యాన్ని రోడ్డుపైకి తరలించేందుకు భారీగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పెరవలి తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. తెలుగు రైతు మండల అధ్యక్షుడు కంటిపూడి సూర్యనారాయణ మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్ టి.రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు అతికాల వెంకటరామకృష్ణమ్మ, ఎంపిటిసి సభ్యులు రాపాక ప్రమీల, టిడిపి రాజమండ్రి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొడ్డు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఐటిడిపి అధ్యక్షుడు అబ్బిశెట్టి సత్తిరాజు పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు మంగం రామారావు, తెలుగు యువత అధ్యక్షుడు హనుమంతు సుబ్రహ్మణ్యం సలాది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










