Jun 01,2023 00:13

ప్రజాశక్తి-గోపాలపురం సార్వా సీజన్‌ ప్రారంభం అవుతున్నందున రైతులందరూ సాగుకు సన్నద్ధం అవ్వాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. గోపాలపురం సొసైటీ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ సార్వా సీజన్‌కు సంబంధించి రైతులు పంటలు రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఎవరి వద్ద నుండి కొనుగోలు చేసినా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. విత్తనాలు చల్లే ముందుగా తప్పనిసరిగా మొలక శాతం, విత్తన శుద్ధి చేయడం వంటి మెలకువలను పాటించాలని కోరారు. భూసార పరిరక్షణ కోసం నేలను సారవంతం చేయడానికి రసాయనిక ఎరువులను మాత్రమే కాక తప్పనిసరిగా పశువుల ఎరువు వర్మి కంపోస్ట్‌ జీవన ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువులను పొలంలో వేసుకొని కలియ దుండినట్లయితే భూసారం సమతుల్యంగా ఉండి వేయబోయే పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయన్నారు. జూన్‌ 1న రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన సొంత భూమి కలిగిన వారి ఖాతాల్లో రూ.7500 చొప్పున ప్రభుత్వం జమ చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురించినట్లుగా తెలిపారు. జూన్‌ రెండో తేదీన వైయస్సార్‌ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాలు తీసుకున్న వారికి మెగా మేళా నిర్వహించి అందజేయనున్నట్టు తెలిపారు.