ప్రజాశక్తి-కడియం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం కడియం ఆవలో వరి పొలాలను ఆయన పరిశీలించారు. కళ్లాల్లో నిలువ ఉన్న, మొలకెత్తిన, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు అధికారులు తమ గోడు వినిపించుకోవడం లేదని, రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకంటే భారీగా కోతలు విధిస్తున్నారని, ఒక్కొక్క ఎకరానికి 35 నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టామని, మూడేళ్లుగా అధిక వర్షాలు, తుపాను కారణంగా ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయామని రైతులు వాపోయారు. గతంలో రైతులకు మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు తక్కువ వడ్డీకి సర్దుబాటు చేసే వారని, ఈ కొత్త విధానం వల్ల కమీషన్ ఏజెంట్లు ప్రాబల్యం తగ్గి, బయట అధిక వడ్డీకి రుణాలు తేవాల్సి వస్తోందని వాపో యారు. సుమారు గంటకు పైగా రైతుల సమస్యలను పవన్ కల్యాణ్ విన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఆరుగాలం శ్రమించిన రైతులకు కష్టమొస్తే ఆదు కోవాల్సిన పాలకులు, అధికారులు వ్యవ హరిస్తున్న తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగు మారిన, మొలకెత్తిన ప్రతి గింజ ప్రభుత్వం కల్పించిన కిట్టుబాటు ధరకే కొనాలన్నారు. అనంతరం ఆయన కడియం, వేమగిరి, కడియపులంక మీదుగా కొత్తపేట తరలి వెళ్లారు. ఆయనకు జన సైనికులు, మహిళలు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.










