ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. కాకినాడ జెడ్‌పి కార్యాలయ సమావేశ హాలులో శుక్రవారం జెడ్‌పి చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్‌పి సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్‌పి సమావేశం అని పెట్టి రైతుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఉమ్మడి జిల్లా అని చెప్పి కేవలం కాకినాడ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నివేదికలో పొందుపర్చారన్నారు. కౌలు రైతులకు ఇచ్చే గుర్తింపు కార్డుల లెక్కల వివరాలు కూడా సమగ్రంగా ఇవ్వలేదన్నారు. జూన్ 1నే కాలువలకు నీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నా నేటికీ అనేక చోట్ల నారుమళ్లు కూడా సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది కూడా ఇదే మాట చెప్పినప్పటికీ సకాలంలో నీటి విడుదల లేకపోవడంతో అపరాల సాగు జరగలేదన్నారు. సమావేశాల్లో అధికారులు చెబుతున్న అంశాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్నారు. చిరుధాన్యాల సాగుపై మాటల్లో తప్ప ఆచరణలో శ్రద్ధ కనబర్చట్లేదన్నారు. ఎజెండాలో 31 అంశాలను పొందుపరచగా వ్యవసాయ, ఇరిగేషన్, వైద్య, ఆరోగ్య, గృహ నిర్మాణ సంస్థ, ఆర్ అండ్ బి, విద్యా, ఉపాది హామీ తదితర 8 అంశాలను మాత్రమే సమావేశంలో చర్చించి మమ అనిపించారు. పిఆర్ ఇంజినీరింగ్ శాఖపై మొక్కుబడిగా కానిచ్చారు. విద్యుత్ శాఖపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అప్రకటిత కరెంటు కోతలపై ధ్వజమెత్తారు.
కౌలు రైతుల చట్టం ప్రకారం భూ యజమాని సంతకం ఉంటేనే సిసిఆర్ కార్డు జారీ చేస్తుండడం వల్ల వాస్తవ సాగుదారుడికి తీవ్ర నష్టం జరుగుతుందని, పలువురు రైతులు అప్పుల పాలవుతున్నారని సమావేశంలో కొందరు జెడ్‌పిటిసిలు ఆవేదన వ్యక్తం చేశారు. తారతమ్యం లేకుండా పూర్తిస్థాయిలో అందరికీ సిసిఆర్ కార్డులు జారీ చేయాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు కోరారు. వాస్తవ సాగుదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విఆర్వో, వ్యవసాయ శాఖ అధికారుల సంతకాలతో ఐదేళ్లు కౌలుకు సాగు చేస్తున్న రైతులకు డిసిసిబి ద్వారా రుణాలిచ్చే ప్రక్రియను కొత్తపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఎంఎల్‌సి కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కాలువల మరమ్మతులు చేపట్టాలన్నారు. కాలువలకు నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాలకు అందడం లేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైందన్నారు. ప్రస్తుతం వానలు కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మెట్ట ప్రాంతాల్లో రాగి వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు కూడా సరఫరా చేశామన్నారు. 0 వేల వరకు భూసార పరీక్షల నమూనాలు తీసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా జెసి ఇలాక్కియా మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు గతేడాది 40 వేల కార్డులు అందించామని, ఈసారి ప్రతి ఒక్క కౌలు రైతుకు కార్డు అందించి, రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనరతరం సీజనల్ వ్యాధులు, చర్యలపై చర్చజరిగింది. అనంతరం వాలంటీర్లపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వారికి పూర్తిభరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వాలంటీర్లకు భరోసాగా తీర్మానం చేశారు. కలెక్టర్లు కృతికా శుక్లా, హిమాన్షు శుక్లా, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, జెడ్‌పి వైస్ చైర్మన్ అనుబాబు తదితరులు పాల్గొన్నారు.










