హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ రామ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి అని హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. శుక్రవారం లాలా చెరువు ప్రాంతంలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 'వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం' మెగా మేళా-2.0 కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ రామ్, జెసి తేజ్ భరత్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలుత సభ వేదిక సమీపంలో వున్న వైఎస్‌ఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోం మంత్రి వనిత మాట్లాడుతూ గత పాలకుల హయాంలో వ్యవసాయాన్ని దండగ అంటే, జగనన్న ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా చేసిందన్నారు. ముందస్తుగా సాగు ద్వారా విపత్తుల నుంచి పంటలను రక్షించుకునే వెసులుబాటు కలిగిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ మార్గని భరత్‌రామ్ మాట్లాడుతూ జిల్లాలో 166 సిహెచ్‌సి గ్రూపులకు రూ.5.96 కోట్లు విలువజేసే 103 ట్రాక్టర్లు, 15 హార్స్ పవర్స్ గల 15 వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తున్నారనాఉ.కొందరు అమలుకు నోచుకోని శుష్క వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. గతంలో కూడా ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయని విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను కొంత మంది కాపీ చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో రైతులు, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసిపి రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యుడు తేజా, సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, స్థానిక నేతలు పాలిక శ్రీను, గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు.
కడియం : వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎఒ కె.ద్వారకాదేవి, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ యీలి గోపాలం కోరారు. శుక్రవారం నిర్వహించిన వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం మెగా మేళా - 2లో కడియం మండలానికి రూ.36 లక్షల విలువైన 4 ట్రాక్టర్లను రూ.14 లక్షల సబ్సిడీతో మంజూరు చేశారన్నారు. కడియం గ్రామానికి చెందిన మూడు సిహెచ్‌సి గ్రూపులకు, కడియపుసావరం గ్రామానికి చెందిన ఒక గ్రూపునకు వీటిని అందించామన్నారు. ఆయా గ్రూపుల వారు రైతులకు అందుబాటులో ఉంటూ యంత్రసేవలు అందించాలని కోరారు.










