Aug 07,2023 00:06

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ మార్గాని భరత్‌, ఎంఎల్‌ఎ నాయుడు

ప్రజాశక్తి - నిడదవోలు
రైల్వే స్టేషన్ల అభివృద్ధి హర్షణీయమని, దీని వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ మార్గానిభరత్‌ అన్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలో 508 స్టేషన్లను సుమారు రూ.24,740 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 18 స్టేషన్లు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు స్టేషన్లు ఎంపికయ్యాయి. అందులో నిడదవోలు రైల్వే స్టేషన్‌ కూడా ఒకటి. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌నాయుడుతో కలిసి ఎంపీ మార్గాని భరత్‌ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. నిడదవోలు రైల్వే స్టేషన్‌కు సుమారు రూ.28 కోట్లు కేటాయించారన్నారు. వీటితో పలు అభివృద్ధి పనులను చేపడతారన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లను స్టేషన్లో నిలుపదల చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఎంపీకి వినతిపత్రం అందజేత
నిడదవోలులో జన్మభూమి, గరీబ్‌ రథ్‌, ఎల్‌టిటిఇ, పలక్‌నామా, ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని జువ్వల రాంబాబు ఎంపీ భరత్‌కు వినతిపత్రం అందించారు. చినకాశీ రేవు వద్ద బసివిరెడ్డి పేట, ఇందిరానగర్‌ని కలుపుతూ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు. దీనికి ఎంపీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.