ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రైల్వేల ప్రయివేటీకరణ దేశ ప్రజలకు తీవ్ర నష్టమని, రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పలువురు వక్తలు అన్నారు. రైల్వేల ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ముద్రించిన 'రైల్వేల ప్రయివేటీకరణ ఎవరికోసం' అనే పుస్తకాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ రాజమండ్రి బ్రాంచ్ నాయకులు విజరు కుమార్, శ్రీనివాసులురెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజు లోవ, జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్.మూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా రైల్వే అని అన్నారు. రైల్వేల ప్రయివేటీకరణ జరిగితే పేదలు ప్రయాణాలకు దూరమవుతారాన్నరు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ రైల్వే అన్నారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండటంవల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. రైల్వేలో సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల తరచూ జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు ఉద్యోగులు భర్తీ చేయకపోవడమే కారణమన్నారు. మోడీ ప్రభుత్వం హయాంలో సుమారు 150 రైళ్లను రద్దు చేశారన్నారు. రైల్వేలు ప్రయివేటుపరం కాకుండా రైల్వే ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.










