Sep 12,2023 23:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ వెల్లడించారు. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లో కొత్తగా నిర్మించిన 4, 5 ఫ్లాట్‌ ఫారమ్‌లను మంగళవారం ఆయన ప్రారంభించారు. నాల్గవ నెంబర్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ నుంచి ట్రైల్‌ రన్‌లో భాగంగా తిరుమల టు కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా 4, 5 ప్లాట్‌ ఫారమ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పనులను వేగంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. తూర్పు రైల్వే స్టేషన్‌ వైపు 6వ నెంబర్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ మంజూరు కానుందని తెలిపారు. ఇప్పటికే వంద అడుగుల రోడ్డు పూర్తయిందని, బాలాజీ పేట జంక్షన్‌ రోడ్డు పనులు కూడా త్వరితగతిన చేపట్టబో తున్నామని వివరించారు. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌ అన్ని హంగులతో రూ.300 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఇప్పుడున్న రైల్వేస్టేషన్‌ను 5 బళ్ళ మార్కెట్‌ వద్దకు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్క్వాడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రొంపిచర్ల రాజేంద్ర, చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ చంద్రమౌళి, స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎం.గంగా ప్రసాద్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు.