Feb 02,2023 23:33

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ నవరత్నాల పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 19 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌, జివి.ప్రసాద్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని జగనన్న కాలనీ లేఔట్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణాల్లో 16.8 లక్షలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1.79 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.5 లక్షల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మరో లక్ష ఇళ్లు స్లాబ్‌ దశకు వచ్చాయన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూతతో పాటు ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, నీటి వనరులు ఆయా లే అవుట్‌ వద్దనే గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామన్నారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా చేయూతను ఇస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు అర్బన్‌లో 2,832 మందికి ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 204 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఈమ కార్యక్రమంలో హౌసింగ్‌ డిఇ ఎం.శ్రీనివాసరావు, ఎఇలు డిఎస్‌. చాంబార్లీన్‌, కెఎస్‌.చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.