ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్ సిఎం వైఎస్.జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన టిడిపి జోన్ 2 సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. ఇటీవల 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో మూడు తామే గెలిచామన్నారు. పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలిచిందన్నారు. ప్రజల్లో మార్పు ప్రారంభమైందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. బిసిలు, ఎస్‌సిలు, చేతివృత్తులు, వివిధ రంగాల కార్మికుల పొట్ట కొట్టిన జగన్ ఎన్నడూ లేనంతగా విపరీతంగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. కందిపప్పు రూ.200 అయి డబుల్ సెంచరీ కొట్టిందన్నారు. రూ.250 అయినా ఆశ్చర్యం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, ఇసుక, మద్యం, కరెంటు ఛార్జీలు అన్నీ పెంచి పేదలను దగా చేస్తున్నారన్నారు. జలగల మాదిరి ప్రజల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుండడం గమనార్హం అన్నారు. కాకినాడలో దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. ప్రశాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అరాచకాలు పెరిగాయన్నారు.
మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలి
'బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ' అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే కలిగే లబ్ధి ప్రజలకు వివరించాలన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు, ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్, రైతన్నల రుణమాఫీ, అన్న క్యాంటీన్‌లు, పెళ్లి కానుక వంటి అనేక పథకాలను అమలు చేశామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. టిడిపి హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని 5.13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ నేడు రాష్ట్రంలో నిరుద్యోగం 35 శాతానికి చేరుకుందన్నారు.
రోడ్లే వేయలేదు మూడు రాజధానులు ఎలా
ఈ నాలుగేళ్ళలో చిన్న రోడ్డు వేయలేని సిఎం మూడు రాజధానులు ఎలా కడతానంటున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. మూడు అని ప్రజల్ని నమ్మించి, అసలు రాజధానే లేకుండా చేశాడన్నారు. టిడిపి అధికారంలో ఉండి ఉంటే రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేసేవాళ్లమన్నారు. భవిష్యత్ లో పోలవరం పూర్తి చేసి మూడు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఇసుక దోపిడీ వల్ల 40 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
రాష్ట్రంలో జగన్ 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అన్ని వర్గాలపై భారాలు వేశారన్నారు. గతంలో రూ.200 వచ్చే బిల్లును ఇప్పుడు వెయ్యి చేశాడని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
'కరెంట్ కోతలు లేని చోటు లేదు, బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు, ఈ రెండూ జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ' అంటూ రజనీ కాంత్ డైలాగ్‌తో సెటైర్ విసిరారు. మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారన్నారు. తన తనయుడు లోకేష్ చేపట్టిన యువగళం గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసారు.
అంతకంటే ముందు జరిగిన సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా నిలిచిన పార్టీ టిడిపి ఒకటే అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా అవినీతి, అక్రమాలను పెంచిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, నిరుద్యోగం, పేదరికం వైసిపి పాలనలో విపరీతంగా పెరిగాయన్నారు. రూ.60 వేల కోట్ల విద్యుత్ అదనపు ఛార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్.జవహర్, మాజీ ఎంఎల్‌ఎలు వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్‌ఎన్.వర్మ తదితరులు పాల్గొన్నారు.










